TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.!

Published on: Wed Oct 28, 2026 5:16PM


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెరుగుతున్న ధరల భారాన్ని కొంతమేర తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఉద్యోగుల కరువు భత్యం (డీఏ), పెన్షనర్ల కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది.

60 శాతం నుంచి 63 శాతానికి డీఏ, డీఆర్.!

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్ ప్రస్తుతమున్న 60 శాతం నుంచి 63 శాతానికి పెరగనుంది. ఈ పెంపు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు పెరిగిన భత్యంతో పాటు గత నెలల బకాయిలు కూడా అందనున్నాయి. అయితే, అదనంగా వచ్చే మొత్తం వారి ప్రాథమిక వేతనం లేదా పెన్షన్‌పై ఆధారపడి ఉంటుంది. 

1.16 కోట్ల మందికి పైగా ప్రయోజనం.!

ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షలకు పైగా పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా 1.16 కోట్ల మందికి పైగా ఈ పెంపు ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కొంత ఆర్థిక ఊరట లభించనుంది. 

గ్రామీణాభివృద్ధి, కంటైనర్ల తయారీకి ప్రోత్సాహం.!

డీఏ, డీఆర్ పెంపుతో పాటు కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనను బలోపేతం చేసేందుకు 2026–27 నుంచి 2030–31 వరకు అమలు చేయనున్న ‘ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన’కు రూ.7,395.55 కోట్ల కేటాయింపుతో ఆమోదం తెలిపింది.

అలాగే, దేశీయంగా కంటైనర్ల తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.


క్రీడా పరికరాల తయారీకి కూడా ఊతం.!

దేశంలో క్రీడా పరికరాల తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్‌’కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.1,856.67 కోట్ల నిధులు కేటాయించారు. దేశీయ తయారీ, సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం దీని లక్ష్యం.  మొత్తంగా కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపు తక్షణ ఆర్థిక ఊరటను అందించనుండగా.. ఇతర పథకాలు గ్రామీణ పాలన, తయారీ రంగాల అభివృద్ధికి దోహదపడనున్నాయి.

 

 

 

[ DA Hike 2026, Dearness Allowance, Dearness Relief, Central Government Employees, Pensioners, Narendra Modi, Union Cabinet Decisions, DA Arrears, PM Viksit Gram Swaraj Yojana, Container Manufacturing Scheme, Khelo India Sports Goods Scheme ]