కోరంగి మహా విషాదం: సైక్లోన్ పదం పుట్టుకకు మూలం.!
Published on: Sun Nov 1, 2026 8:45AM

ప్రకృతి వైపరీత్యాలను సూచించడానికి మనం నిత్యం వాడే సైక్లోన్ అనే పదం వెనుక ఒక మహా విషాద చరిత్ర ఉంది. మనసు బరువెక్కే బాధామయ గాథ ఉంది. సైక్లోన్ పదం పుట్టుక వెనుక లక్షల మంది కన్నీళ్లు, ఒక మహానగర వినాశనం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని కుదిపేసిన ఒక మహా విపత్తు తుపానుల విషాదాలను, విలయాలను కళ్లకు కట్టేలా సైక్లోన్ పదం పుట్టింది. ఆ మహా విషాదమే ప్రపంచానికి సైక్లోన్ పదాన్ని పరిచయం చేసింది.
18వ శతాబ్దంలో కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంతర్జాతీయ రేవుపట్నంగా వెలుగొందింది. నాటి కాలంలో డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ దేశాల నుంచి భారీ నౌకలు ఇక్కడికి వచ్చి వాణిజ్య లావాదేవీలు నిర్వహించేవి. బర్మాలో స్థిరపడిన తెలుగువారిని సైతం నాటి రోజుల్లో కోరంగీలు అని పిలిచేవారంటే ఆ రేవు ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. విదేశీ నౌకలతో ఎల్లప్పుడూ కళకళలాడే ఆ ప్రాంతానికి అప్పట్లో వాణిజ్య విశిష్ఠ గుర్తింపు ఉండేది.
.webp)
1839 నవంబర్ 25 అర్ధరాత్రి సమయంలో బంగాళాఖాతంలో ఊహించని రీతిలో ప్రళయం ముంచుకొచ్చింది. నిద్రపోతున్న కోరంగి నగర ప్రజలపైకి ప్రకృతి ప్రళయరూపం దాల్చి విరుచుకుపడింది. సముద్రం నుంచి ఏకంగా నలభై అడుగుల ఎత్తున ఎగిసిపడిన రాకాసి అలలు కోరంగిని ముంచేశాయి. క్షణాల వ్యవధిలో వేలాది ఇళ్లు నీట మునిగి నేలమట్టం కాగా, లంగరు వేసి ఉన్న భారీ ఓడలు కొట్టుకుపోయాయి. ఈ మహా విలయంలో దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారేసరికి ఆ ప్రాంతమంతా శవాల దిబ్బగా మారింది. మ్యాప్ నుంచే కోరంగి అనే పేరు తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కరాత్రి వ్యవధిలో శతాబ్దాల నాగరికత సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఈ ఘోర విషాదాన్ని కళ్లారా వీక్షించిన నాటి బ్రిటిష్ అధికారి హెన్రీ పిడ్డింగ్టన్.. ఆ మహా విపత్తుకు సైక్లోన్ అని పేరు పెట్టారు.
ఆ పెను ఉప్పెన సమయంలో పాములా చుట్టలు చుట్టుకుంటూ విరుచుకుపడిన ఆ బలమైన సుడిగాలి తీవ్రతను పరిశీలించిన ఆయన, గ్రీకు భాషా పదం ఆధారంగా ఆ విపత్తును సైక్లోన్ గా పిలిచారు. అదే ఇక తుపానులకు పర్యాయపదంగా మారిపోయింది. అలా ఆంధ్రప్రదేశ్ తీరంలో సంభవించిన ఒక పెను విషాదం ద్వారా సైక్లోన్ పదం పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలోకి వచ్చిది. నాటి కోరంగి ప్రాంతం నేడు కాలగర్భంలో కలిసిపోయినా, చరిత్రలో అది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అయితే అదే తీరప్రాంతంలో కాలక్రమేణా ప్రకృతి తనదైన రీతిలో రక్షణ వలయాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మడ అడవులు విస్తరించి ఉన్నాయి. సునామీ వంటి విపత్తుల సమయంలోనూ ఈ దట్టమైన అడవులే కాకినాడ తీరాన్ని కాపాడినట్లు నిపుణులు చెబుతుంటారు.
[Cyclone Word Origin History, Korangi, Tragedy, Henry Piddington, Cyclone Name,
Andhra Pradesh, Historical Storms, Telugu One]


