TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిజాంపట్నంలో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ: మురసు తుపాన్ ఎఫెక్ట్.!

Published on: Mon Nov 2, 2026 4:31PM

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చి రాష్ట్రం వైపునకు దూసుకొస్తున్న  మురసు తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీవ్రత  పెరుగుతుండటంతో తీర ప్రాంతాల్లోని అన్ని ప్రధాన పోర్టుల వద్ద అధికారులూ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతుండటం,  పెనుగాలులు వీస్తుండటంతో ఓడరేవుల వద్ద ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. 

నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక పోతే భీముని పట్నం, కాకినాడ, కళింగపట్నంలలో 3 నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.  

మురసు తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో   అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన సముద్రం మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేరర్చడంతో పాటు తుపాను ప్రభావం ఉన్న తీర ప్రాంతాల ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది.

తీరప్రాంతాల్లోని ఓడరేవుల నిర్వహణ నిపుణులు,  పోర్ట్ అధికారులు నిరంతరం వాతావరణ పరిస్థితులను మానిటర్ చేస్తున్నారు. తుఫాను గమనాన్ని బట్టి పోర్టుల్లో సిగ్నల్ స్థాయిలను మారుస్తూ నౌకల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా పోర్టు పరిసర ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలను పటిష్టం చేశారు.

రాబోయే కొన్ని గంటలు అత్యంత కీలకం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ కంట్రోల్ రూమ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు,  తుఫాను ముప్పు ఎక్కువగా ఉన్న జిల్లాలలో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్  బృందాలను రంగంలోకి దించారు.  

[Cyclone Murasu Effect,  AP Ports Alert, Danger Signals Andhra Ports, Murasu Cyclone, Andhra Pradesh Coast Cyclone Alert, Telugu One]