TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్నాబ్ ఎఫెక్ట్: కోనసీమ అంధకారం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, తగ్గని గాలుల తీవ్రత.!

Published on: Wed Oct 28, 2026 10:04AM

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను అర్నాబ్ తుపాను తీవ్రంగా వణికించింది. నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

  ప్రచండ గాలులకు కోనసీమలోని 19 మండలాల పరిధిలో భారీ వృక్షాలు, వందలాది కొబ్బరి చెట్లు నేలకూలాయి. అలాగే అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాత్రి సమయంలో కోనసీమలోని పలు ప్రాంతాలు పూర్తిగా అంధకారంలో మగ్గాయి. రహదారులపై భారీ చెట్లు అడ్డంపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో గతంలో సంభవించిన ఉప్పెనను గుర్తు చేసుకుని తీరప్రాంత ప్రజలు భయంతో వణికి పోయారు.   కోనసీమలో వీచిన బలమైన గాలుల హోరు గతంలోని పెను తుపానులను తలపించేలా ఉందని స్థానికులు తెలిపారు.  

విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో   సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రహదారులపై పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు యంత్రాంగం శ్రమించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పలు ప్రాంతాల్లో వరి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ కారణంగా ప్రాణనష్టం  జరగలేదని అధికారులు చెప్పారు.  తుపాను కారణంగా జరిగిన ఆస్తినష్టం, విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడం వంటి సమస్యలతో సాధారణ పరిస్థితులు కుదుటపడటానికి కొంత సమయం పట్టేలా ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు.


[Cyclone Arnab Effect on , Konaseema, Power Supply, Heavy Rain, Strong Winds, Waterlogg,  TeluguOne]