అర్నబ్ ఎఫెక్ట్: తమిళనాట అతి భారీ వర్షాలు..14 మంది మృతి.!
Published on: Tue Oct 27, 2026 8:52AM

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకు వస్తోంది. అదే సమయంలో భారీ వర్షాలతో తమిళనాడును అతలాకుతలం చేసింది. దక్షిణ తమిళనాడుతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండ ప్రాంతాల్లో మట్టిచరియలు విరిగిపడటంతో రహదారులు ధ్వంసమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఊటీకి వెళ్లే రైలుమార్గంలో బండరాళ్లు పడటంతో రైలు సర్వీసులను నిలిపివేశారు. తిరిగి ఈ నెల 29 నుంచి ఆ మార్గంలో రైలు సర్వీసులను పురనుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక కొడైకెనాల్ లోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఘాట్ రహదారులపై మట్టిచరియలు, రాళ్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అతి భారీ వర్షాల కారణంగా తమిళనాట 14 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
.webp)
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అర్నాబ్ తుపాను ఎఫెక్ట ఏపీపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుపాను తీవ్ర తుపానుగా మారి బుధవారం (అక్టోబర్ 28) బాపట్ల విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను ప్రభావంతో ఉత్తర, మధ్య కోస్తా జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసింది. తుపాను కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
[Cyclone Arnab Effect Heavy Rains Tamil Nadu, Landslides, Ooty Train Services, Andhra Pradesh, Severe Effect, Government, High Alert, Telugu One]


