TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్నాబ్ తుపాను ముప్పు.. ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

Published on: Sun Oct 25, 2026 3:37PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి 'అర్నాబ్' తుపానుగా మారుతుండటంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంపై ముంచెత్తుతున్న ఈ పెను ముప్పును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం రాబోయే ఐదు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రజలు ఎవరూ అప్రమత్తత కోల్పోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ తుపాను బుధవారం నాటికి బాపట్ల మరియు విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ సమయంలో తీర ప్రాంతాల వెంబడి గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రమాదకర స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. 

అలాగే ప్రమాదకరంగా మారిన హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాకకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బలగాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంచినట్లు మంత్రి తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు వేగవంతం చేయాలని ఆమె సూచించారు.  మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కఠిన నిబంధనలు విధించారు. అదేవిధంగా పర్యాటకులు ఎవరూ కూడా బీచ్‌ల వైపు వెళ్లకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 

సముద్రపు అలల వద్ద సెల్ఫీలు దిగడం వంటి సాహసాలకు పాల్పడవద్దని ప్రజలను గట్టిగా హెచ్చరించారు.   సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ విపత్తుల నిర్వహణ సంస్థ అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం అధికారిక టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. రైతులు కూడా తమ పంటలను కాపాడుకోవడానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.   

 

 

 

[ Cyclone Arnab, AP Weather News, Minister Vangalapudi Anita, Andhra Pradesh Cyclonic Storm, Coastal Andhra Rains, Cyclone Arnab landfall, AP Home Minister, Telug One, Telugu News, NDRF,SDRF ]