దూసుకొస్తున్న వాయు‘గండం’: అధికార యంత్రాంగం అప్రమత్తం.. తిరం దాటేదెక్కడంటే?
Published on: Wed Sep 23, 2026 11:40AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో తూర్పు కోస్తా రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరిన్నింటిని దారి మళ్లించింది. విశాఖపట్నం, కొత్తవలస, కిరండోల్ మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను బుధ, గురు (సెప్టెంబర్ 23, 24) రద్దు చేసింది. ఈ మార్గంలో పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుండటంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర వైపు వస్తోంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం (సెప్టెంబర్ 23) అర్ధరాత్రి లేదా గురువారం (సెప్టెంబర్24) తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. విశాఖలో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు అతి భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉద్యాన పంటలకు నష్టం భారీ వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్లలో భారీ వర్షాలు కురిసి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో రాత్రివేళ భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో బుధ, గురు వారాలు (సెప్టెంబర్ 23, 24) పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
{Cyclone, Andhra Pradesh, Heavy Rains, Cyclonic Winds, Trains, Cancil, High Alert, Uttarandhra, Telugu One}


