స్నాప్‌చాట్‌లో పరిచయం.. యువతికి రూ.1.38 కోట్ల టోపీ..!
Published on: Tue Aug 25, 2026 3:27PM

ఎమోషనల్ బ్లాక్‌మెయిల్.. కోటిన్నర పోగొట్టుకున్నటెక్కీ.. !
సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు పెంచుకోవడం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేసే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా చిక్కిన వలలో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఏకంగా రూ.1.38 కోట్లు కోల్పోయి రోడ్డున పడింది. విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన ఒక యువతి హైదరాబాద్ నగరంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు స్నాప్‌చాట్ యాప్ ద్వారా మద్దిశెట్టి గౌతమ్ నాయుడు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ప్రాంతానికి చెందినవాడినని అతను నమ్మబలికాడు. కొద్దిరోజులకే వీరి పరిచయం కాస్త గట్టి స్నేహంగా మారింది. ఫోన్ నంబర్లు మార్చుకుని క్రమం తప్పకుండా మాట్లాడుకోవడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి పర్యటనలకు కూడా వెళ్లారు. గత జూన్ మాసంలో తమిళనాడులోని కోయంబత్తూర్ ట్రిప్‌కు వెళ్లిన సమయంలో నిందితుడు తన అసలు ప్లాన్‌ను అమలు చేయడం ప్రారంభించాడు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో తాను సుమారు రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టానని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ ఖాతా బ్లాక్ అయిందని అతడు యువతికి చెప్పాడు. అత్యవసరంగా నగదు కావాలంటూ ఆమెను నమ్మించడంతో, బాధితురాలు తన పొదుపు మొత్తంతో పాటు వివిధ డిజిటల్ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని రూ.10.42 లక్షలను నిందితుడి ఖాతాకు బదిలీ చేసింది. ఆ తర్వాత కూడా గౌతమ్ నాయుడు ధనాశ తీరలేదు. మరింత నగదు కావాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. యువతి వద్ద డబ్బు లేదని చెప్పడంతో కిలాడీ మోసగాడు కొత్త డ్రామాకు తెరలేపాడు.
డబ్బులు పంపకపోతే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ కొన్ని భయానక ఫోటోలను పంపి ఆమెను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేశాడు. అతని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కు భయపడిపోయిన యువతి.. తన తల్లికి తెలియకుండా ఇంట్లోని బంగారు ఆభరణాలను బ్యాంకులు, తాకట్టు సంస్థల్లో కుదువ పెట్టింది. అలాగే పలు క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు తీసుకుని విడతల వారీగా రూ.1.27 కోట్లను అతనికి ఇచ్చేసింది. ఇలా మొత్తం రూ.1.38 కోట్లు సమర్పించుకుంది. అయినప్పటికీ నిందితుడు ఇంకా డబ్బు కావాలంటూ వేధింపులు కొనసాగించడంతో, తా తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన బాధితురాలు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు.
ఈ దారుణ ఘటనపై నెటిజన్లు, నిపుణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం సోషల్ మీడియా పరిచయాలు, సైబర్ నేరగాళ్ల ఎమోషనల్ డ్రామాలకు బలికావడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీస్ అధికారులు ప్రజా అవగాహన పెంచేలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పరిచయమైన వారి మాటలను గుడ్డిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని, ఆత్మహత్య బెదిరింపులు లేదా అత్యవసర నిధుల పేరుతో వచ్చే సందేశాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. సదరు నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Cyber Crime, HyderabadCrypt,o Investment Scam, Telugu,Snapchat, Friendship, Cyber Fraud, Online Fraud, Emotional Blackmail, Vijayawada, Techie Cybe,r Crime News, Home minister anitha, CM Chandrababu


