TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్‌బీఐలో సైబర్ దాడి: డార్క్ వెబ్‌లో ఖాతాదారుల డేటా లీక్.!

Published on: Thu Oct 22, 2026 10:53AM

దేశంలో బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సైబర్ భద్రతా సవాలును ఎదుర్కొంటోంది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరుగాంచిన ఎస్‌బీఐలో సైబర్‌ దాడి జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  డార్క్ వెబ్ వేదికగా కొందరు  బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టారన్న వార్తలు బ్యాంకింగ్ వర్గాలలో తీవ్ర కలకలం రేపాయి. దీనిపై స్పందించిన బ్యాంకు యాజమాన్యం, కొంతమంది కస్టమర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు బహిర్గతమైనట్లు అంగీకరిస్తూ, సైబర్ దాడిని ధృవీకరించింది. 

డార్క్ వెబ్‌లో లభ్యమైన   3.75 లక్షల రికార్డులను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి,  3,897 మంది ఖాతాదారులకు చెందిన వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (పీఐఐ) లీకైందని తేల్చారు.  ఈ లీకైన వివరాల్లో ఖాతాదారుల పేర్లు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, జెండర్, ఈమెయిల్ అడ్రస్‌లు, నివాస చిరునామాలు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా బ్రాంచ్ కోడ్‌లు, రుణ  దరఖాస్తులకు సంబంధించిన మెటాడేటా కూడా లీకైందని నిపుణులు గుర్తించారు.  

ఈ అనధికారిక డేటా లీక్‌కు సంబంధించి అక్టోబర్ 16న కీలక హెచ్చరికలు అందాయని ఎస్‌బీఐ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. బ్యాంకుకు చెందిన థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్‌తో పాటు, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్  నుంచి ఈ సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు ఉన్నతాధికారులు సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్,  కంటెయిన్‌మెంట్ ప్రొటోకాల్స్‌ను వేగవంతంగా అమలులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనపై  దర్యాప్తు జరిపేందుకు  ఒక స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని బ్యాంకు రంగంలోకి దించింది. ఈ ప్రత్యేక బృందం లీకైన రికార్డుల ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు, డేటా ఎక్కడి నుంచి లీకైందనే మూలాలను వెలికితీసే పనిలో నిమగ్నమైంది. అలాగే ఖాతాదారులకు, బ్యాంకుకు దీనివల్ల ఎంతటి ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే దానిపై ఈ ఏజెన్సీకూపీలాగుతోంది. 

అయితే, ఈ సైబర్ దాడి ,  డేటా లీక్ పరిణామం తమ కోర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని ఎస్‌బీఐ చెబుతోంది. బ్యాంకు దైనందిన సేవలు, వ్యాపార కొనసాగింపు ఎటువంటి అంతరాయాలు లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది 

 [Cyber Attack in SBI, State Bank of India Data Leak, Dark Web Customer Data, SBI Security Breach, Telugu One]