కూర బాగోలేదన్న భర్త.. కత్తితో పొడిచి చంపిన భార్య.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ దారుణ హత్య.!
Published on: Mon Nov 9, 2026 12:08PM
.webp)
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రాత్రి భోజనంలో వండిన కూర బాగోలేదన్న చిన్నపాటి కారణంతో మొదలైన వివాదం కాస్తా, చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. దేశం కోసం ఆర్మీలో సేవ చేసి రిటైర్ అయిన 39 ఏళ్ల దిలీప్ ఖరాడీని, ఆయన భార్య నిర్మలా ఖరాడీ దారుణంగా హత్య చేసింది.
అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో ఉన్న నరోడా స్మార్ట్ సిటీ-2లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ దంపతుల మధ్య గత ఏడాది కాలంగా ఇల్లు, ఆర్థిక విషయాలకు సంబంధించి తరచూ మనస్పర్థలు, చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో భోజనం చేసే తరుణంలో రాత్రి వండిన కూర ఏమిటని దిలీప్ తన భార్య నిర్మలను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
ఈ చిన్న వాగ్వాదం క్షణాల్లోనే తీవ్ర రూపం దాల్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన నిర్మల ఒక్కసారిగా విచక్షణ కోల్పోయింది. వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే పదునైన కత్తిని తీసుకువచ్చి, భర్త దిలీప్ ఎడమ ఛాతిపై బలంగా పొడిచింది. ఈ అనూహ్య పరిణామానికి దిలీప్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తన భర్తకు తీవ్రగాయాలు కావడంతో భయపడిపోయిన నిర్మల, వెంటనే తన బావ ముకేష్‌కు ఫోన్ చేసి తాను కత్తితో పొడిచినట్లు సమాచారం అందించింది.వెంటనే కుటుంబ సభ్యులు క్షతగాత్రుడైన దిలీప్‌ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే మార్గమధ్యలోనే ఆయన పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకుని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న దిలీప్ తండ్రి సోమాజీ ఖరాడీ.. తన కొడుకు ఛాతిపై ఉన్న కత్తిపోటు గాయాలను, చేతులపై ఉన్న గాయాలను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. దేశం కోసం సరిహద్దుల్లో కాపలా కాసి క్షేమంగా తిరిగొచ్చిన తన కొడుకు, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్య చేతిలోనే ఇలా దారుణంగా హత్యకు గురికావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు.
.webp)
ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నరోడా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజీలు స్థానికుల నుంచి లభించిన సమగ్ర సమాచారం ఆధారంగా గాలించి.. నిందితురాలైన భార్య నిర్మలను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ఒక చిన్న వంటకం వివాదం ఇంతటి ఘోరానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది. కేవలం క్షణికావేశం మనుషుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. పోలీసులు ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: దీపావళి వేళ తీవ్ర విషాదం: సొంతూరికి వెళ్తుండగా నదిలో మునిగిన కారు.. నలుగురు మృతి.!
[ Curry dispute murder, retired army jawan dies, Ahmedabad crime, Naroda murder case, husband wife fight, Gujarat news, Telugu One, Telugu News ]


