ఇండియాకు చమురు సెగ.!
Published on: Mon Aug 24, 2026 9:31AM

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావం ఇండియాపై తీవ్రంగా కనిపిస్తున్నది. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతుండటంతో.. ఆ ప్రభావం ఇండియాపై పడుతోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణ రంగానికి అయ్యే ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి.
పశ్చిమాసియాలో ఫిబ్రవరి నెల నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం చమురు విపణిపై భారీగా పడింది. ఒక దశలో భారత్ కొనుగోలు చేసే క్రూడ్ ధర బ్యారెల్‌కు 69 డాలర్ల నుంచి ఏకంగా 113 డాలర్ల మార్కును దాటేసింది. ఆ తర్వాత కొంత వ్యవధి పాటు ధరల్లో కొంత స్థిరత్వం కనిపించినప్పటికీ, ఆగస్టు నాటికి మళ్లీ పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్లకు పైగానే ఉంది.
ఈ పరిణామాల ప్రభావం ఇండియన్ రిటైల్ ఇంధన మార్కెట్‌పై నేరుగా పడింది. మే నెలలో పెట్రోల్ , డీజిల్ పై లీటరుకు సగటున రూ. 7.50 చొప్పున ధరలు పెరిగాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 102.12కు, డీజిల్ రూ. 95.20కి చేరగా, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ రేట్లు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయి.
డీజిల్ ధరల పెంపుతో రవాణా రంగానికి అయ్యే నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో కూరగాయలు, పాలు, తృణధాన్యాలు, ఇతర ప్యాకేజ్డ్ నిత్యావసర వస్తువుల సరఫరా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సరుకుల రవాణా ఖర్చు పెరగడంతో వ్యాపారులు కూడా ఆ భారాన్ని వినియోగదారులపైనే వేస్తున్నారు. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం జులై లో ఏకంగా 4.45 శాతానికి ఎగబాకింది.
దీంతో వేతన జీవులు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదాయంలో మార్పు లేకపోవడం, నెలవారీ గృహ బడ్జెట్‌లో సరుకులు, ప్రయాణ ఖర్చులు రెట్టింపు కావడంతో వారి ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి, క్రూడ్ ఆయిల్ సరఫరా పునరుద్ధరిస్తే తప్ప చమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగి సామాన్యుడిపై భారం మరింత పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
Crude Oil Prices Impact, Petrol Diesel Hike India, Essential Commodities Inflation, West Asia Crisis Fuel Rates, Hyderabad Fuel Prices


