చమురు ధరల భారీ పతనం: అగ్రరాజ్యాధినేత ట్రంప్ జోస్యం.!
Published on: Thu Oct 8, 2026 12:01PM

చమరు ధరలు త్వరలో భారీగా పతనం కానున్నాయని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. ఓ వైపు ఇరాన్ తో యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు సరఫరా గొలుసు తెగిపోయి.. ధరలు ఆకాశమే హద్దుగా పైపైకి ఎగుస్తున్నాయి. చమురు లభ్యతకే ముప్పు ఏర్పడే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలోనే.. ప్రపంచ దేశాలు ఇరాన్ అమెరికా యుద్ధం ఎప్పుడు ముగున్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇరాన్ తో యుద్ధం త్వరలో ముగుస్తుందనీ, అప్పుడు చమురు ధరలు భారీగా పతనమౌతాయనీ ట్రంప్ చెబుతున్నారు,

వాషింగ్టన్ నుంచి మధ్యంతర ఎన్నికల ప్రచారానికి బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన చర్యలు కీలక ఫలితాలను ఇచ్చాయనీ, ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా బెబ్బతీశామనీ చెప్పుకొచ్చారు. ఇక యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ధీమా యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు పతనమౌతాయని ట్రంప్ అన్నారు.
ఇరాన్ యుద్ధం ప్రభావం కేవలం ఆ దేశానికే పరిమితం కాలేదు. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరా వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, ఇంధన రవాణాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ప్రస్తుతం అక్కడ నౌకలపై దాడుల ముప్పు పెరగడంతో మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.
యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 7న బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 100.20 డాలర్ల వద్ద ముగియగా.. అక్టోబర్ 8న మళ్లీ పెరిగి 102 డాలర్లకు పైగా చేరింది.
మరోవైపు ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావడానికి అంతర్జాతీయంగా వ్యూహాలు కూడా మొదలయ్యాయి. చమురు నిల్వలను మార్కెట్లోకి వేగంగా విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థలు నిర్ణయించాయి. జీ7 దేశాలు కూడా భారీగా చమురు, శుద్ధి చేసిన ఇంధన నిల్వలను విడుదల చేసే ప్రణాళిక ప్రకటించాయి. దీని ఉద్దేశం పెరిగిన ఇంధన ధరలకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించడమే. ట్రంప్ తాజా ప్రకటన ఉద్దేశం కూడా అదేనంటున్నారు. అయితే ట్రంప్ గతంలో కూడా ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుందని పలుమార్లు ప్రకటించారు. అందుకే ఇప్పుడు ట్రంప్ చేసిన తాజా ప్రకటనను ప్రపంచ మార్కెట్లు పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు.
[Crude Oil Prices Come Down, Donald Trump, America President, Iran War, Iran-US War, Oil Prices, Strait of Hormuz, Telugu One]


