TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందితే జుట్టు, అందకుంటే కాళ్లు: ట్రంప్ అనుమతిపై విమర్శలు.!

Published on: Wed Oct 14, 2026 10:42AM

రష్యా నుంచి డీజిల్‌ సరఫరాకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్ర విచిత్రంగా స్పందించారు. రష్యా నుంచి వచ్చే డీజిల్‌ అమెరికా వినియోగం కోసం కాదని, ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల చేయడానికి అంటూ వివరణ ఇచ్చరు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సరఫరాను పెంచడం ద్వారా ధరల ఒత్తిడిని తగ్గించవచ్చన్న కారణంతోనే రష్యా నుంచి డీజిల్ సరఫరాకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు ఈ ఒప్పందం ఆర్థికంగా లాభం చేకూరుస్తుందని అమెరికాలోని రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ నేతలు విమర్శిస్తున్నారు. 

 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో అక్టోబర్‌ 9న చర్చలు జరిపిన అనంతరం ట్రంప్‌ ఈ డీజిల్‌ సరఫరా ఒప్పందాన్ని ప్రకటించారు. తొలుత 3 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా డీజిల్‌ను సరఫరా చేయనున్నట్లు, నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత అదనంగా 10 లక్షల టన్నులు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అమెరికా ట్రెజరీ శాఖ రష్యా డీజిల్‌ ఎగుమతులపై ఉన్న ఆంక్షలకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఈ అనుమతి 2027 ఏప్రిల్‌ 7 వరకు అమల్లో ఉంటుంది.  

రష్యా నుంచి వచ్చే ఇంధనం ద్వారా మాస్కోకు ఆదాయం పెరిగి, ఆ నిధులు ఉక్రెయిన్‌ యుద్ధానికి ఉపయోగపడే ప్రమాదం ఉందన్న విమర్శలపై ట్రంప్‌ ఇది డీజిల్‌ ఒప్పందం. మన కోసం కాదు. ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామంటూ డొంకతిరుగుడు సమాధానం ఇచ్చారు.  ప్రపంచ మార్కెట్‌లో డీజిల్‌ ధరలు పెరిగాయని, ఇంధన శుద్ధి కేంద్రాలపై దాడులు సరఫరాపై ప్రభావం చూపాయన్న ట్రంప్ అదనపు ఇంధనం అందుబాటులోకి వస్తే అంతర్జాతీయంగా సరఫరా, డిమాండ్‌ మధ్య అంతరాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని చెప్పుకొచ్చారు.  

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో మాస్కో ఆదాయాన్ని తగ్గించేందుకు అమెరికా గతంలో రష్యా ఇంధన సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు డీజిల్‌ ఎగుమతులకు తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం అమెరికా విదేశాంగ విధానం డొల్లతనాన్ని మరోసారి ప్రస్ఫుటంగా చాటింది. అన్నిటికీ మించి అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లుగా తయారైన ట్రంప్ వైఖరిని కళ్లకు కట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఆ దేశానికి అదనపు ఆదాయం అందుతుందని, తద్వారా యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం పెరగుతుందనీ విమర్శలు  వెల్లువెత్తుతున్నా ట్రంప్ ఖాతరు చేయలేదు. భారత్ వంటి దేశాలు రష్యా నుంచి చమురు కోనుగోలుపై కన్నెర్ర చేస్తున్న ట్రంప్ తాజా నిర్ణయంపై ప్రపంచ దేశాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ట్రంప్ తాజా నిర్ణయం పై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ  అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్‌లోని కొందరు సభ్యులు సైతం ఆంక్షలను సడలించడం కంటే రష్యాపై మరింత ఒత్తిడి తీసుకు రావడమే సరైన నిర్ణయం అవుతుందంటున్నారు. 

ప్రపంచ మార్కెట్‌లోకి అదనపు డీజిల్‌ రావడం వల్ల సరఫరాకు కొంత ఊరట లభించే అవకాశం ఉన్నప్పటికీ, ధరలు దీర్ఘకాలికంగా తగ్గుతాయా అన్నది అనుమానమే. ప్రకటించిన సరఫరా పరిమాణం ప్రపంచవ్యాప్త డీజిల్‌ వినియోగంతో పోలిస్తే చాలాచాలా పరిమితమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

[Criticism Donald Trump Russian Diesel, Trump Putin Deal 2026, Russian Diesel Exports, US Russia Sanctions, Global Fuel Prices, Ukraine War, Telugu One]