TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఘాటైన వాసనలు పదే పదే చూడాలని అనిపిస్తోందా..ఒక్క సారి హిమోగ్లోబిన్ చెక్ చేస్కోండి..!

Published on: Tue Oct 27, 2026 10:50AM

ఇంటి బాధ్యతలను మోస్తూ, కుటుంబం  కోసం నిరంతరం శ్రమిస్తున్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్ బాధ్యతల ఒత్తిడిలో పడి మహిళలు తమ శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను, అనారోగ్య సూచనలను సాధారణంగా కొట్టిపారేస్తుంటారు. అయితే, మన శరీరం ప్రతి చిన్న విషయానికీ స్పందిస్తూ కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తూ ఉంటుంది. వాటిని సమయానికి గుర్తించి జాగ్రత్త పడకపోతే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అసలు కొందరు మహిళలు ఘాటైన వాసనలు పదే పదే చూడాలని ఎందుకు అనుకుంటారు? దీని వెనకున్న ఆరోగ్య సమస్య ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..

ఘాటైన వాసనలు..

రోజూవారీ జీవితంలో మనలో చాలామందికి కొన్ని వింత అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా అమృతాంజనం, విక్స్ లేదా నీలగిరి తైలం వంటి ఘాటైన వాసనలను పదే పదే పీల్చాలని అనిపించడం, లేదా వాటిని దగ్గరగా పెట్టుకుని చూడటం చేస్తుంటారు. అలాగే వంటగదిలో ఉండే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలను , మసాలా దినుసులను సాధారణ మోతాదు కంటే ఎక్కువగా, నేరుగా నమిలి తినాలనిపించడం లాంటి కోరికలు కలుగుతుంటాయి. ఇవి కేవలం సాధారణ రుచికి సంబంధించిన అలవాట్లు కాకపోవచ్చు.

ఎందుకు ఈ అలవాట్లు..?

వైద్య శాస్త్రం ప్రకారం, శరీరంలో హిమోగ్లోబిన్ లేదా ఐరన్ శాతం తగ్గినప్పుడు ఇలాంటి ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. దీనిని 'పికా' (Pica) అనే ఆరోగ్య పరిస్థితిగా చెబుతారు. శరీరంలో రక్తం కొరత ఏర్పడినప్పుడు లేదా ఎర్ర రక్త కణాల నిర్మాణం మందగించినప్పుడు, మెదడుకు అందవలసిన పోషకాలు సరిగ్గా అందక ఇటువంటి వింతైన కోరికలు పుట్టుకొస్తాయి. మట్టి, సుద్ద, ఐస్ ముక్కలు తినాలనిపించడం ఎంత సాధారణమో, ఘాటైన వాసనలను పీల్చాలనిపించడం , మసాలా దినుసులను తినాలనిపించడం కూడా అదే కోవలోకి వస్తుంది.

కారణాలు..

మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించడానికి ప్రధాన కారణాలు రకరకాలుగా ఉంటాయి. క్రమ పద్ధతిలో లేని జీవనశైలి, నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావం, పోషకాహార లోపం,  విశ్రాంతి సరిగా లేకపోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ మోతాదు వేగంగా పడిపోతుంది. దీనివల్ల ఎప్పుడూ నీరసం, తలతిరగడం, శరీరం తెల్లగా మారడం, ఏకాగ్రత తగ్గడం, పనులపై ఆసక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి తోడు ఈ ఘాటైన వాసనలను పీల్చడం వల్ల లేదా మసాలా పదార్థాలను అధికంగా తినడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం దొరికినట్లు అనిపించినా, అది దీర్ఘకాలంలో కడుపులో మంట, అల్సర్ , జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

ఇలాంటి వింత లక్షణాలు లేదా అలవాట్లు మీలో లేదా మీ చుట్టూ ఉన్న మహిళల్లో కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దు. వెంటనే ఒకసారి వైద్యులను సంప్రదించి కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC) పరీక్ష చేయించుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలము. పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, బీట్రూట్, దానిమ్మ పండ్లు, ఖర్జూరాలు, బెల్లం, వేరుశెనగలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన ఆలోచనలే మహిళల నిజమైన ఎదుగుదలకు, సాధికారతకు బలమైన పునాది వేస్తాయి.

                                                                                                                                                 *రూపశ్రీ.