నా ఓటు తొలగించారు.. ఏపీ సీపీఐ కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!
Published on: Wed Aug 26, 2026 8:44PM

దేశంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే వర్గాలను లక్ష్యంగా చేసుకుని భారీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ప్రొద్దుటూరులోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
నా ఓటే తొలగించారు..!
తాను గతంలో 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా పోటీ చేశానని.. అలాంటి తన ఓటునే తొలగించారంటే ఎన్నికల వ్యవస్థ ఏ స్థాయిలో దుర్వినియోగమవుతోందో అర్థం చేసుకోవచ్చని ఈశ్వరయ్య అన్నారు. ఓట్ల తొలగింపుపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉచిత బస్సు పథకం రద్దు చేసే కుట్ర..!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఈశ్వరయ్య ఘాటుగా స్పందించారు. కూటమి అధినేత చంద్రబాబు నాయుడికి తెలియకుండానే వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారా అని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు తెరవెనుక ఉండి పెద్దలతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు.
ఆర్థిక పరిస్థితిపై విమర్శలు..!
దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, భారత రూపాయి విలువ పాకిస్థాన్ కంటే దారుణంగా పడిపోతుంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని ఈశ్వరయ్య విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు పుట్టిన తర్వాతే దేశంలో ప్రజలు శ్రీరాముడిని పూజిస్తున్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో శ్రీరామచంద్రుడి పేరిట సేకరించిన బంగారు ఇటుకలు ఏమయ్యాయో కేంద్ర పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
CPI State Secretary G V Eswaraiah, Gujjula Eswaraiah, CPI Andhra Pradesh, Kadapa News
SIR Voter Deletion, Voter List Revision, Voter Deletion, Narendra Modi, CM Chandrababu


