తెలంగాణ ఆర్టీసీలో నిధుల గోల్‌మాల్‌..! ఆడిటింగ్ లో బయటపడుతోన్న అక్రమాలు

తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో భారీగా నిధుల గోల్‌మాల్‌ జరిగినట్టు తేలింది. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిన అధికారులు... పెద్దఎత్తున డబ్బును పక్కదారి పట్టించినట్లు ఆడిటింగ్ లో గుర్తించారు. అయితే, నచ్చిన రూట్లలో బస్సులను నడిపించి డబ్బులు నొక్కేశారన్న మాటలు సమ్మె సమయంలోనే వినిపించాయి. దాంతో, సమ్మె కాలంలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సుమారు రెండు నెలలపాటు జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, మొదట టికెట్లు లేకుండానే బస్సులను నడిపించారు. ఆ, తర్వాత ప్రింటెడ్‌ టికెట్లతో సర్వీసులను రన్ చేశారు. అయితే, సమ్మె కాలంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఆడిటింగ్ విభాగం ఎంక్వైరీ చేపట్టింది. దాంతో, సమ్మె కాలంలో నడిపిన సర్వీసుల ఆదాయ వ్యయాల్లో భారీ తేడాలను ఆడిటింగ్ విభాగం గుర్తించింది. ఆ డబ్బుంతా డిపో స్థాయి అధికారుల జేబుల్లోకి వెళ్లాయనే మాటలు వినిపిస్తున్నాయి.

సమ్మె తర్వాత ఆర్టీసీలో సమూల ప్రక్షాళన చేపట్టిన ఉన్నతాధికారులకు... ఆడిటింగ్‌లో బయటపడుతున్న అక్రమాలను చూసి కంగుతింటున్నారు. సమ్మెకాలంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్లే పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందని అంటున్నారు. అయితే, అధికారుల చేతివాటం రుజువైతే మాత్రం కఠిన చర్యలు తప్పవని మంత్రి పువ్వాడ అజయ్‌ హెచ్చరిస్తున్నారు.
 
అయితే, సమ్మెకాలంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఇస్తామన్న డబ్బు కూడా ఇవ్వకుండా, డిపో స్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని యూనియన్ నేతలు అంటున్నారు. అంతేకాదు, ఆర్టీసీ సమ్మె కాలంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేలకోట్ల నష్టాల్లో కొనసాగుతోన్న ఆర్టీసీలో చేతివాటం ప్రదర్శిస్తోన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు అంటున్నారు.