సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పై అనుచిత పోస్టు: సుమోటో విచారణకు సుప్రీం న్యాయవాది డిమాండ్.!
Published on: Tue Oct 13, 2026 2:33PM
.webp)
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన ఓ వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వివాదాస్పద పోస్ట్‌పై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలను పరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ సీజేఐకి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టు సమీపంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు నిర్వహించిన నిరసనపైనా విచారణ జరపాలని కోరారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు స్పందించాల్సి ఉంది.
ఢిల్లీలో నిరసన కార్యక్రమాలపై విధించిన ఆంక్షల గురించి మాట్లాడిన సందర్భంగా సీజేఐ సూర్యకాంత్.. శాంతిభద్రతల అంశం తన పరిధిలోనిది కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాలో సీజేఐ రాజీనామా చేయాలంటూ పోస్ట్ పెట్టారు. ఆ సందేశంపై న్యాయవాదులు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆ తరువాత దానిని దాన్ని తొలగించారు.
ఈ వ్యవహారంపై కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ స్పందించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండా, అనుమతి లేకుండానే ఈ పోస్ట్ చేసినట్లు తెలిపారు. దానికి బాధ్యుడైన వ్యక్తిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఆ సందేశం కాంగ్రెస్ నాయకత్వ అధికారిక వైఖరిని ప్రతిబింబించదని, న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో ఈ పోస్ట్‌ను పరిశీలించి, అవసరమైతే సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరారు. ఆ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శల పరిధిలోకి వస్తాయా? లేదా కోర్టు ధిక్కరణ చట్టం, 1971లోని సెక్షన్ 2(సి) కింద పరిశీలించాల్సిన అంశమా? అన్నది సుప్రీం నిర్ణయించాలని కోరారు.

కాగా ఇదే ఫిర్యాదులో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని కూడా ఆ న్యాయవాది ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేతలు నిరసన చేపట్టారు.ఆ నిరసన సమయంలో నిషేధిత ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశించారా? భద్రతా నిబంధనలు ఉల్లంఘించారా? కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగిందా? వంటి అంశాలను సీసీటీవీ దృశ్యాలు, ప్రవేశ నియంత్రణ రికార్డుల ఆధారంగా పరిశీలించాలని జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీజేఐ రాజీనామాను కోరుతూ చేసిన పోస్ట్‌పై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. న్యాయవ్యవస్థ స్వతంత్రత, అత్యున్నత న్యాయస్థానంపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతినకుండా చూడాలని సూచించాయి.
[Controversial Post Regarding Justice Surya Kant, CJI, Supreme Court Complaint; Contempt of Court, Vineet Jindal, Telugu One]


