ఒడిశాలో రెండు తలల శిశువు జననం: వీణా వాణీలను గుర్తు తెస్తున్న వైనం.!
Published on: Wed Oct 14, 2026 11:14AM

వైద్య ప్రపంచంలో అరుదైన ఘటన ఒడిశా లో వెలుగుచూసింది. ఒకే శరీరానికి రెండు తలలు అతుక్కుని ఉన్న మగ శిశువుకు ఓ మహిళ జన్మనిచ్చింది. సాధారణంగా సాధారణంగా లక్షల జననాలలో ఒక జననం ఇలా జరుగుతుందని అంటారు. రెండు తలలతో జన్మించిన నవజాత శిశువు ఉదంతం స్థానికంగానే కాకుండా వైద్యవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
ఒడిశాలోని కంధమాల్ జిల్లా తుముడిబంధ్ ప్రాంతానికి చెందిన నిరుపేద దంపతులకు ఈ బిడ్డ జన్మించింది. భర్త రోజువారీ కూలీగా జీవనం సాగిస్తుండగా, గర్భం దాల్చిన ముప్పై రెండవ వారంలోనే ఆ మహిళకు ప్రసవం జరిగింది. ఈ దంపతులకు ఇదే మొదటి సంతానం పుట్టిన వెంటనే శిశువులో ఉన్న అనూహ్య శారీరక మార్పులను గుర్తించిన స్థానిక వైద్యులు.. అత్యవసర చికిత్స నిమిత్తం ఆ బిడ్డను వెంటనే బెర్హంపూర్లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరిభాషలో ఈ విచిత్రమైన , సంక్లిష్టమైన పరిస్థితిని డైసెఫాలిస్ పారాపాగస్ అంటారు. దీని ప్రకారం ఒకే శరీర నిర్మాణానికి రెండు వేర్వేరు తలలు, రెండు మెడలు జతకూడి ఉంటాయి. అయితే బాహ్యంగా పరిశీలిస్తే ఈ శిశువుకు రెండు చేతులు, కాళ్లతో పాటు ఒకే మూత్ర, జననేంద్రియ వ్యవస్థ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ప్రస్తుతం ఆ శిశువును ఆసుపత్రిలోని ప్రత్యేక సంరక్షణ విభాగంలో ఉంచి వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. పుట్టుకతోనే తలెత్తిన ఈ అసాధారణ శరీర నిర్మాణాన్ని అంచనా వేసేందుకు నిపుణులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అరుదైన కవలలు లేదా అతుక్కుపోయిన శరీరాలు గల కేసులు దాదాపు మూడు లక్షల జననాలలో ఒకటి మాత్రమే నమోదవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటన గతంలో ఒడిశాలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సియామీస్ కవలలైన జగ, కలియాల జ్ఞాపకాలను మరోసారి గుర్తుకు తెస్తోంది.
గతంలోనూ ఇలాంటి అరుదైన కవలల కేసులు ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్కు చెందిన వీణా-వాణిల ఉదంతం. అతుక్కుని పుట్టిన ఈ అవిభక్త కవలలను శస్త్ర చికిత్స ద్వారా వేరు చేస్తే వారి ప్రాణాలకే ముప్పు కావడంతో వారు సంవత్సరాల పాటు ఆసుపత్రిలోనే ప్రత్యేక సంరక్షణలో పెరిగారు. ప్రస్తుతం ఒడిశాలో జన్మించిన ఈ రెండు తలల శిశువు విషయంలో కూడా అంతర్గత అవయవాల తీరు ఎలా ఉందనే దానిపైనే తదుపరి వైద్య చికిత్స ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
[Conjoined twins Odish, Two headed infant, Odisha medical news, Dicephalus parapagus, Rare Birth Kandhamal, MKCG Medical College, Telugu One]


