TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ జీరోయే: గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాజకీయ దైన్యతకు దర్పణం.!

Published on: Thu Oct 29, 2026 3:04PM

దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అగాధం నుంచి పాతాళంలోకి జారిపోతున్నట్లుగా తయారైంది. తాజాగా కీలక రాష్ట్రాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీ స్కోరు జీరో కావడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల పరిధిలో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు రాజకీయంగా కాంగ్రెస్ దయనీయ స్థితికి అద్దంపట్టాయి.   అధికారంలో ఉన్న కర్నాటక సహా  ఉత్తరప్రదేశ్, బీహార్  మహారాష్ట్ర లో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో  కాంగ్రెస్ చతికిల బడితో..  బీజేపీ,  మిత్రపక్షాలు విజయదుందుభి మోగించి తమ రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి.  

కాంగ్రెస్ గత పదిహేనేళ్లుగా తన ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపుతోంది. కానీ తాజాగా నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం) ద్వారా కాకుండా   బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగాయి. అయినా కాంగ్రెస్ జీరో రిజల్ట్ సాధించింది.  ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియా వేదికగా  బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తిరోగమనం ఎంత వేగంగా జరుగుతోందన్నది చెప్పకనే చెప్పాయి.

ఈ ఎన్నికల విషయంలో ప్రధానంగా చెప్పుకోవలసి విషయమేంటంటే ఇవన్నీ కూడా  గ్రాడ్యుయేట్,  ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలోనే జరగడం మరో విశేషం. ఈ స్థానాల్లో ఓటర్లంతా విద్యావంతులు, మేధావులు,  సమాజంలో చైతన్యవంతమైన వర్గానికి చెందినవారు.  అలాంటి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కు శూన్య హస్తమే దక్కింది.  అంటే ఆ వర్గాలు కూడా కాంగ్రెస్ కు దూరమయ్యాయని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి స్వయంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో సైతం కాంగ్రెస్ విజయాన్ని నమోదు చేసుకోలేకపోవడం ఆ పార్టీ రాజకీయ దయనీయతకు అద్దంపడుతోంది.  

 కర్ణాటకలో మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా, వాటిలో 3 స్థానాలను బీజేపీ, 1 స్థానాన్ని జేడీఎస్ గెలుచుకున్నాయి. ఇక యూపీలో  11 స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ 5, సమాజవాదీ పార్టీ 3, ఇతరులు 3 స్థానాలను గెలుచుకున్నారు. బీహార్‌లో  8 స్థానాల్లో బీజేపీ 2, జేడీయూ 1, ఆర్జేడీ 1, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ 1, ఇండిపెండెంట్లు 2 స్థానాలను దక్కించుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన 5 స్థానాలకు   బీజేపీ 2, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ 2, శివసేన (షిండే వర్గం) 1 స్థానాన్ని గెలుచుకున్నాయి.  ఈ  ఓటములు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విద్యావంతులు మరియు పట్టభద్రుల వర్గాలలో కాంగ్రెస్ కోల్పోతున్న పట్టుకు ఈ ఫలితాలను నిదర్శనంగా చూపుతున్నారు.  

[Congress Score Zero In MLC Elections,  Four States, BJP Victory Graduate MLC Constituencies, Ballot Paper Elections, Telugu One]