పులివెందులలో కాల్పుల కలకలం
Published on: Tue Sep 15, 2026 10:24AM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో సోమవారం (సెప్టెంబర్ 14)వినాయకచవితి రోజు అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. అర్ధరాత్రి చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. స్థానిక వినాయక విగ్రహ ఏర్పాటు, పూజా కార్యక్రమాల విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో కాల్పులు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
అందిన సమాచారం మేరకు, వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్దకు చేరుకున్న రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. పాత కక్షలు, స్థానిక ఆధిపత్య పోరు ఈ వివాదానికీ, ఘర్షణకు కారణమై ఉండవచ్చని పోలీసులుచెబుతున్నారు. ఈ ఘర్షణ పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గీయుల జరిగిందని చెబుతున్నారు. ఈ ఘర్షణ కారణంగా విజయ్ నివాసం వద్ద రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఘర్షణ సందర్భంగా కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఉద్రిక్తత మరింత ముదరకుండా పట్టణంలో గస్తీని ముమ్మరం చేసి, పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాలకు చెందిన కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
[Commotion over Pulivendula shooting, Kadapa district, Pulivendula Vinayaka Mandapam, Kadapa District Telugu One]


