హైదరాబాద్ లో గవర్నర్ కే సర్వాధికారాలు?

 

రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్ లో రెండు ప్రభుత్వ వ్యవస్థలు మరో తొమ్మిదేళ్ళపాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కనుక వాటి మధ్య ఎటువంటి సమస్యలు, ఘర్షణలు ఏర్పడినా వాటి వలన హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్: 8ని ఏర్పాటుచేసి, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యతను గవర్నర్ కి అప్పగించబడింది. సుమారు మూడు నాలుగు నెలల క్రితమే గవర్నర్ నరసింహన్ కూడా సెక్షన్ :8 ద్వారా తనకు సంక్రమించే అధికారాలను, బాధ్యతలను నిర్వచించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే అప్పుడు ఇటువంటి విపత్కర సమస్యలేవీ లేనందున కేంద్ర ప్రభుత్వం కూడా తాత్సారం చేసినట్లుంది. కానీ గత రెండు వారాలలో జరిగిన పరిణామాల వలన ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడటంతో కేంద్రం ఇప్పుడు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీను సంప్రదించిన తరువాత కేంద్ర హోంశాఖ అందుకు అనుమతించినట్లు సమాచారం.

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని కోసమే కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. కానీ తెలంగాణా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు ప్రభుత్వాలు దేని వాదన అవి బలంగా వినిపిస్తున్నాయి. కానీ సెక్షన్: 8 ప్రకారం గవర్నర్ తన విశేషాధికారాలను ఉపయోగించుకొని ప్రస్తుత పరిస్థితులను తక్షణమే చక్కదిద్దవలసిందిగా కేంద్రప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. కనుక తెలంగాణా ఎసిబి చూస్తున్న ఓటుకు నోటు దర్యాప్తుని, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుని కూడా ఇకపై గవర్నర్ నరసింహన్ స్వయంగా పర్యవేక్షించవచ్చును. ఆ రెండు సంస్థలు ఇకపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కాక గవర్నర్ కే తమ దర్యాప్తు నివేదికలను సమర్పించి ఆయన ఆదేశాల ప్రకారమే వ్యవహరించవలసి ఉంటుంది.

 

అయితే దీని ప్రధానోద్దేశ్యం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన ఘర్షణను తొలగించడమే తప్ప తెలంగాణా ప్రభుత్వ అధికారాలను హరించడం కోసం కాదనే విషయం గమనించవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కానీ, గవర్నర్ కి గానీ అటువంటి ఉద్దేశ్యమే ఉన్నట్లయితే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుండే సెక్షన్: 8 అమలుచేసి ఉండేవారు. కానీ సెక్షన్: 8 ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశ్యం సమస్యలు నివారించాలనే తప్ప సృష్టించాలని కాదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ ఇరువురూ కూడా దానిని ఇంతవరకు వినియోగించాలనుకోలేదని స్పష్టమవుతోంది. కనుక ప్రస్తుతం ఏర్పడిన విపరీత పరిస్థితులను చక్కదిద్దేంతవరకే ఆయనకు సెక్షన్: 8 ద్వారా కలిగిన ప్రత్యేకాధికారాలు వినియోగించుకొనేందుకు కేంద్రం అనుమతించి ఉండవచ్చును తప్ప శాశ్వితం కాదని భావించవచ్చును. కనుక పరిస్థితులు చక్కబడగానే తెలంగాణా ప్రభుత్వానికే హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడే బాధ్యతలను అప్పగిస్తారనడంలో సందేహమూ లేదు. ఒకవేళ అప్పుడు కూడా గవర్నర్ తన విశేషాధికారాలను వినియోగించుకొంటున్నట్లయితే అప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయడం సహేతుకంగానే ఉంటుంది.