10 నుంచి బొద్దింకల ఉద్యమం ఉధృతం: అభిజీత్ అరెస్టుకు రంగం సిద్ధం.?
Published on: Mon Oct 5, 2026 1:20PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్జానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో బొద్దింకల పార్టీ చేపట్టిన ఆందోళనతో ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఈ ఆందోళనలకు అనుమతి నిరాకరించినప్పటికీ బొద్దింకల పార్టీ వెనకడుగు వేయలేదు. అయితే జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలతో పోల్చుకుంటే శివాజీ పార్క్ వద్ద కాక్రోచ్ పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనకు ఒకింత తక్కువ ప్రజాదరణే లభించిందని చెప్పాలి.
.webp)
అది పక్కన పెడితే.. ఈ నెల 10 నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దిప్కే ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాక్రోచ్ జనతాపార్టీ అధినేతను ముందస్తుగా అదుపులోనికి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినవస్తున్నాయి.
ఈ పరిణామాలపై స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తనతో పాటు అభిజీత్, అశుతోష్, రత్న తదితర సీజేపీ ముఖ్య నేతలను అకారణంగా అరెస్టు చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. ఇటువంటి కక్షసాధింపు చర్యలకు తాము భయపడేది లేదని, యువత ఇప్పటికే చైతన్యవంతమైందని హెచ్చరించారు. నాయకులు జైలుపాలైనంత మాత్రాన హక్కుల సాధన కోసం సాగే పోరాటం ఆగదన్నారు.

గతంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా సీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర ఉంది. ఆ సమయంలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టారు. ఇప్పుడు అదే జోరుతో, ఈసారి మరింత పెద్ద లక్ష్యంతో మరో ప్రజా ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ 10 నుంచి భారీ ప్రజా సమీకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్న తరుణంలో, ఈ అరెస్టు వార్తలు తెరపైకి రావడం, దానికి సీజేపీ ఘాటుగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
[Cockroach Janata Party Agitation, Gyanesh Kumar, CJP Protests, Abhijit arrest, Gyanesh Kumar, Mumbai Shivaji Park Agitation, Telugu One]


