ఉచిత టిఫిన్: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం.!
Published on: Tue Sep 22, 2026 5:32PM

తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయమే పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉచిత అల్పాహార పథకం మరింత విస్తరించింది. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలకే పరిమితమైన ఈ పథకాన్ని తాజాగా 6 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా వర్తింపజేశారు.మంగళవారం తిరువాన్మియూర్ గాంధీ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ ఈ పథకం విస్తరణను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా విద్యార్థులకు టిఫిన్ వడ్డించారు. అనంతరం వారితో కలిసి కింద కూర్చొని అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి వారితో సరదాగా ముచ్చటించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజ్‌ను గౌరవిస్తూ ఈ పథకానికి “పెరుంతలైవర్ కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌గా పేరు పెట్టారు. తాజా విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా 15,454 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 15.30 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులు ఉదయం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా చదువుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పథకం విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.217.63 కోట్ల అదనపు నిధులను కేటాయించింది. దీంతో ఉదయం అల్పాహార పథకానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ.724 కోట్లకు చేరింది.
వాస్తవానికి ఈ పథకం విస్తరణను సెప్టెంబర్ 17న ప్రారంభించాల్సి ఉండగా.. ముఖ్యమంత్రి విజయ్ లండన్ పర్యటన నేపథ్యంలో కార్యక్రమం వాయిదా పడింది. దీంతో మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. అయితే చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి ఈ పథకం విస్తరణను అమలు చేయడం లేదు. అక్టోబర్ 6న మధురాంతకం, ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటమే ఇందుకు కారణం. విద్యార్థులకు అందించే అల్పాహారంలో ఉప్మా, కిచిడీ, పొంగల్ వంటి పౌష్టికమైన ఆహార పదార్థాలను చేర్చారు. వారానికి రెండు రోజుల పాటు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని కూడా అందించనున్నారు.

ఈ పథకం అమలును గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్, తమిళనాడు మహిళా అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి. పాఠశాలల్లోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు అల్పాహారాన్ని తయారు చేసి విద్యార్థులకు వడ్డించనున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే చదువులో విద్యార్థుల పురోగతికి కూడా ఈ పథకం దోహదపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
[ CM Vijay,Tamil Nadu Government, Free Breakfast Scheme, Kamarajar Breakfast Scheme, School Students, Free Tiffin Scheme, Government Schools, Nutritious Breakfast, Tamil Nadu Education,Breakfast Scheme Expansion ]


