TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బామ్మకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం విజయ్.. !

Published on: Tue Sep 1, 2026 9:57PM

 

ప్రోటోకాల్ పక్కనపెట్టి సామాన్యుడిలా ముచ్చటించిన విజయ్..!

తమిళనాడు రాజకీయాల్లో తన మార్కు పాలనతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పర్యటనల సమయంలో నిరాడంబరంగా వ్యవహరిస్తూ ప్రజలకు చేరువయ్యే ఆయన, తాజాగా 'సేలం జిల్లా పరిధిలోని చిన్నకావూరు గ్రామంలో సర్‌ప్రైజ్ విజిట్ చేసి స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశారు.

సాంబ పంట సాగు నిమిత్తం కావేరీ డెల్టా రైతులకు నీరందించేందుకు మేటూరు జలాశయం గేట్లను ఎత్తే అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం విజయ్ సేలం వచ్చారు. డ్యామ్ నీటి విడుదల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయన కాన్వాయ్ ఊహించని విధంగా చిన్నకావూరు వైపు మళ్లింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ముఖ్యమంత్రి తమ గ్రామానికి రావడంతో స్థానికులు ఆనందోత్సాహాల మధ్య ఘన స్వాగతం పలికారు.

గ్రామంలోకి అడుగుపెట్టిన సీఎం విజయ్ నేరుగా స్థానిక రైతు పి. రామసామి నివాసానికి వెళ్లారు. రైతు కుటుంబ సభ్యులతో సానుకూలంగా ముచ్చటించిన ఆయన, వ్యవసాయ పరిస్థితులు, నీటి సరఫరా మరియు వారి సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు కుటుంబానికి నూతన వస్త్రాలను అందజేసి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

ఈ పర్యటనలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రైతు ఇంటి వద్ద ఒక వృద్ధురాలు సీఎం విజయ్‌ని ఎంతో ఆప్యాయంగా పలకరించి పక్కన నడుచుకుంటూ వచ్చింది. ఆ క్షణంలో సీఎం విజయ్ తాను ధరించిన బ్రాండెడ్ సన్ గ్లాసెస్ (కూలింగ్ గ్లాసెస్) ను తీసి ఆ వృద్ధురాలికి బహుమతిగా ఇచ్చారు. ఆమె ఆ కళ్లజోడు ధరించి సీఎం చేయి పట్టుకుని నడవడం అక్కడ ఉన్నవారిని విశేషంగా ఆకట్టుకుంది.

గ్రామస్తుల నుండి స్వయంగా వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి, కావేరీ డెల్టా చివరి ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు ఏ లోటూ లేకుండా అందుతుందని భరోసా ఇచ్చారు. ప్రతి చుక్క నీటినీ సమర్థవంతంగా వినియోగించుకుని పంట దిగుబడి పెంచాలని రైతులకు సూచించారు.

ఈ ఘటనపై ప్రతిపక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఏఐఏడీఎంకే వంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు సీఎం పర్యటనలను పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణిస్తుండగా, అధికార టీవీకే పార్టీ శ్రేణులు మాత్రం ఇది సీఎం ప్రజాభిమానానికి నిదర్శనమని పేర్కొంటున్నాయి.

ఏది ఏమైనా, ముఖ్యమంత్రి విజయ్ నేరుగా సామాన్య రైతు ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడం, అక్కడి ప్రజలతో మమేకం కావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న నీటి సదుపాయంతో ఈ ఏడాది సాంబ పంట ఆశించిన స్థాయిలో పండుతుందో లేదో వేచి చూడాలి.

 

CM Vijay, Chinnakavoor Farmer, Mettur Dam, Tamil Nadu Politics, Vijay Salem Visit,  Telugu One, Telugu news