అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
Published on: Mon Sep 28, 2026 8:21PM
.webp)
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన అసోంలో జరిగిన ప్రముఖ పత్రికల జాతీయ సదస్సులో ఆయన పాల్గొని, దేశంలో నెలకొన్న కేంద్ర-రాష్ట్రాల సంబంధాలు, ఆర్థిక వివక్షపై నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఉత్తరాది ఆధిపత్య ధోరణులు పెరుగుతున్నాయని పరోక్షంగా విమర్శించారు. దేశ రాజధానిలో కీలక పదవులన్నీ ఒకే ప్రాంతం వారి చేతుల్లో కేంద్రీకృతం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రా నుంచి భారీగా పన్నులు వసూలు చేసుకుంటూ, కేవలం దిల్లీకి నమస్కరించే స్థాయిలోనే ప్రాంతాలు ఉండకూడదన్న ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
దేశాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అభివృద్ధితో దేశం మొత్తాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లలేమని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా బలపడి దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ, వాటి హక్కులను మరియు వనరులను సరిగ్గా గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన గుర్తుచేశారు. చిన్న గ్రామాలు, ఆదివాసీ గూడేల్లోనూ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ విద్య అందించేందుకు ప్రయత్నించారని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 27 వేల పాఠశాలలు, 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ఆరోగ్య రంగంపైనా దృష్టి సారించారని, స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో సగటు ఆయుర్దాయం 33 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 73 ఏళ్లకు చేరిందని చెప్పారు.
తెలంగాణలో విద్యాశాఖను తాను ఎంచుకున్నానని చెప్పారు. రెవెన్యూ, ఆర్థిక శాఖలపై చర్చ జరిగినా వాటిని తీసుకోకుండా విద్యాశాఖను తీసుకున్నానని తెలిపారు. భూ గరిష్ట పరిమితి చట్టం వచ్చిన తర్వాత తెలంగాణలో 25 లక్షల ఎకరాలను దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన, పేద కుటుంబాలకు పంచారని, ప్రస్తుతం పంచేందుకు రాష్ట్రంలో భూములు లేవని అన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణకు అంత స్థాయిలో కేంద్రం నుంచి సహకారం లభించడం లేదని అన్నారు.
తెలంగాణకు మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల విస్తరణ వంటి అంశాల్లో కేంద్రం నుంచి సహకారం అందడం లేదని ఆరోపించారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు పిలిచి రెండేళ్లు అవుతున్నా ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉందని చెప్పారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అడిగినప్పుడల్లా ఫైల్ ప్రధానమంత్రి వద్ద ఉందని చెబుతున్నారని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, అజయ్ బంగా తదితరులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారని ప్రస్తావించారు. తెలంగాణలో ఐఎస్‌బీ, ఐఐటీ, నల్సార్ వంటి విద్యాసంస్థలు ఉన్నాయని, నిపుణులు ఉన్న చోటే కంపెనీలు వస్తాయని అన్నారు.

ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల్లోని అవకాశాలను ప్రోత్సహించాలని అన్నారు. గుజరాత్‌కు పోర్టు వంటి అవకాశాలు ఉంటే, తెలంగాణకు విమానాశ్రయం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని చెప్పారు.అంబేడ్కర్, మన్మోహన్‌సింగ్, అబ్దుల్ కలాం వంటి వారు చదువుకోవడం వల్లే గొప్ప స్థాయికి ఎదిగారని చెప్పారు. యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విద్యా విధానంలోని లోపాలను గుర్తించామని సీఎం తెలిపారు.
2006లో జడ్పీటీసీ సభ్యునిగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా. ఆ రెండు సార్లు నేను కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్కడ రెండు పార్టీలే ఉన్నాయి.. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పెద్దగా సంబంధాలు పెద్దగా లేవు.. ప్రభుత్వంపై పోరాడాలంటే ప్రతిపక్షమే మేలని భావించా.. అందుకే నేను తెలుగుదేశంలో చేరా.. ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. 2017లో కాంగ్రెస్‌లో చేరాను. 2019లో ఎంపీగా గెలిచాని రేవంత్ తెలిపారు.తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు
దేశ సగటున 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే, తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ వైపు వెళ్తున్నారని తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.కమిషన్ సభ్యులు గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారని, ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను ఎందుకు పంపడం లేదని అడిగితే.. ఇంగ్లీష్ మీడియం కావాలని తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరగతి నుంచే విద్య ప్రారంభమవుతోందని చెప్పారు.
పదో తరగతి తర్వాత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో నాణ్యత లోపిస్తోందని, తగిన సంఖ్యలో లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉండటం లేదని పేర్కొన్నారు.కేంద్రంలో కీలకమైన పదవులు, విధాన నిర్ణయాల్లో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రతను కాపాడుకోవాలంటే సమాఖ్య స్ఫూర్తిని అక్షరాలా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. లేనిపక్షంలో ప్రాంతీయ అసంతృష్యాలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య సామాజిక న్యాయ సూత్రాలను ఈ వేదికగా ఆయన మరోసారి సమర్థించారు. దేశంలో ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని, ఏ ఒక్క రాష్ట్రమూ వివక్షకు గురికాకూడదన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.ఈ సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పలు ప్రాంతీయ పార్టీల నేతలు, విశ్లేషకులు ఈ అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర-రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు సమాఖ్య విధానాలపై ఈ చర్చ మరింత జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.
[ CM Revanth Reddy, Assam News Paper Conclave, Northern Dominance, Telangana Model, Regional Disparities India, Indian Politics 2026,Telugu One, Telugu News ]


