సిరిసిల్లకు భారీ వరాలు: రూ.345 కోట్ల పనులకు సీఎం శ్రీకారం.!
Published on: Wed Sep 30, 2026 9:07PM
.webp)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో నేతన్న బజార్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సిరిసిల్లతో పాటు వేములవాడలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో రూ.5 కోట్లతో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను ప్రారంభించారు. వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రజాపాలనలో వెయ్యి రోజుల్లో నేత కార్మికుల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1,700 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు. సిరిసిల్లలో తమ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీని ఒప్పించి మంత్రిని చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాలో అభివృద్ధి పనులను మరింత వేగంగా కొనసాగిస్తామని తెలిపారు.
[ CM Revanth Reddy, Sirisilla Development, Rajanna Sircilla, Telangana Development, Sirisilla News, Revanth Reddy Sirisilla Tour, Development Works, Rs 345 Crore Projects, Nethanna Bazaar, Young India Integrated Residential Schools, Telangana Public Schools, Vemulawada Temple ]


