అర్నాబ్ తుపాను: ఒక్క ప్రాణం కూడా పోవద్దు.. అధికారులతో సమీక్షలో చంద్రబాబు దిశానిర్దేశం.!
Published on: Mon Oct 26, 2026 3:12PM

అర్నాబ్ తీవ్ర తుపాను ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం తుపానుగా, తీవ్ర తుపాను గా మారి కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు రక్షణ చర్యలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ తీవ్ర తుపాను కారణంగా ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదనీ, అందుకుఅవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన విస్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తుపాను గమనం, తీరం దాటే ప్రాంతాలు, వర్షాల తీవ్రతపై ఈ సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమత్రికి నివేదించారు. బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున, ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తక్షణమే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా తుపాను సమయంలో రమారమి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా టెలికాం శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే రోడ్లపై పడిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు రోడ్డు రవాణా, పంచాయతీ రాజ్ శాఖల సిబ్బందిని సన్నద్ధం చేయాలన్నారు.

రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కోత దశకు వచ్చిన పంటలను సురక్షిత ప్రాంతాలకు లేదా గోదాములకు తరలించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని, తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను ఇప్పటికే అత్యంత ప్రభావితమయ్యే జిల్లాలకు తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షించాలని, ప్రజల నుంచి వచ్చే సహాయక అభ్యర్థనలకు వెంటనే స్పందించాలని చంద్రబాబు ఆదేశించారు.
[CM Chandrababu Review On Arnab Cyclone, AP Government Cyclone Preparedness, Disaster Management, Andhra PRadesh, Telugu One]


