TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంచుకొస్తున్న మురసు: అప్రమత్తమైన యంత్రాంగం: సీఎం అత్యవసర సమీక్ష.!

Published on: Mon Nov 2, 2026 3:51PM

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు మురసు తుఫానుముప్పు ముంచుకొస్తున్న తరుణంలో  ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.  తుఫాను ముందస్తు సన్నద్ధత, తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సోమవారం (నవంబర్ 2) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.  

తాజా సమాచారం ప్రకారం, ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా,  రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉంటుంది.  బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,  తిరుపతి జిల్లాలలో అతి భారీ నుంచి తీవ్ర భారీ  వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మురసు కూడా తీవ్ర తుపానుగా మారి సోమవారం (నవంబర్ 2) అర్ధరాత్రి లేదా మంగళవారం (నవంబర్ 3) తెల్లవారు జామున  ఒంగోలు సమీపంలో ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందనీ, భారీ వర్షాల కారణంగా మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందనీ హెచ్చరించింది.  

తుఫాను సమయంలో తలెత్తే విద్యుత్ అంతరాయాలను నివారించడానికి విద్యుత్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. దక్షిణ కోస్తా,  రాయలసీమ జిల్లాల్లో సంభవించే నష్టాన్ని తట్టుకునేందుకు అవసరమైన సిబ్బందిని, ప్రత్యామ్నాయ సామగ్రిని సిద్ధం ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు  ప్రాంతాల్లో సమర్థవంతమైన నీటి నిర్వహణను అమలు చేసి, వర్షపు నీటిని రిజర్వాయర్లు, చెరువుల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాబోయే గంటలు అత్యంత కీలకం కావడంతో ఏ ఒక్క శాఖ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని   ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. 

[CM Chandrababu Review, Murusu Cyclone,  Andhra Pradesh Cyclone Alert, Murusu Cyclone Landfall Ongole, Flash Floods,  AP Weather, Telugu One]