TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్నబ్ తుపానుపై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ..రాత్రంతా రంగంలోనే యంత్రాంగం.!

Published on: Wed Oct 28, 2026 2:26PM

రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి, రాత్రి నుంచి ఉదయం వరకు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించారు.

తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలగా, పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితులపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా ఉపశమనం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల, గ్రామ స్థాయి సిబ్బందితోనూ మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు.. తుపాను సహాయక చర్యల్లో అధికారులు, సిబ్బంది రాత్రి నుంచే నిమగ్నమయ్యారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కూలిన చెట్లను తొలగించడం, దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకున్నారు.

వాట్సాప్, సోషల్ మీడియా, మీడియా, కంట్రోల్ రూమ్‌ల ద్వారా అందుతున్న సమాచారం, ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించడంతో విద్యుత్ పునరుద్ధరణ, కూలిన చెట్ల తొలగింపు వంటి పనుల్లో ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తోంది.

మంత్రులు సైతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. చెరువులు, కాలువల్లో నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ఇంజినీరింగ్ చర్యలు చేపట్టాలని సూచించింది.

తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆస్తి నష్టాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తుపాను పూర్తిగా తొలగిపోయే వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

 

 

 

[ CM Chandrababu Naidu continues to monitor Cyclone Arnab, Cyclone Arnab Andhra Pradesh, AP Secretariat, Cyclone Arnab, Chandrababu Naidu, Andhra Pradesh Government, Cyclone Alert, AP Rainfall, Konaseema District, Cyclone Relief Operations, Power Restoration, Disaster Management, Andhra Pradesh News ]