53 రోజుల నిర్బంధం.. కోట్లాది హృదయాల స్పందన మరువలేను: సీఎం చంద్రబాబు. !
Published on: Sat Oct 31, 2026 9:18PM

మూడేళ్ల క్రితం ఇదే రోజు రాజమండ్రి జైలు నుంచి విడుదల.!
53 రోజుల నిర్బంధ సమయంలో తనకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును జీవితాంతం మర్చిపోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశారు. నాడు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
53 రోజుల నిర్బంధం.. జీవితంలో మరిచిపోలేని ఘట్టం.!
తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులు అత్యంత కఠినమైనవని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పటి పాలకులు తనను నంద్యాలలో అర్ధరాత్రి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని, అది కుట్రపూరిత అరెస్టు అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. న్యాయస్థానం తీర్పుతో జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజల్లోకి వచ్చిన రోజును గుర్తుచేసుకున్నారు. తనను నిర్బంధించి ఒంటరిని చేయాలనుకున్న ప్రయత్నాలు ప్రజల సంఘీభావంతో విఫలమయ్యాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాడు తనకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల స్పందనను ఎప్పటికీ మర్చిపోలేనని స్పష్టం చేశారు.

గచ్చిబౌలి స్టేడియంలో మద్దతు మరువలేనిది.!
తనకు సంఘీభావం తెలిపేందుకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 'సీబీఎన్ గ్రాటిట్యూడ్' కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృత్తి నిపుణుల మద్దతు జీవితాంతం గుర్తుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ప్రవేశపెట్టిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు మద్దతుగా నిలవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు సంఘీభావం తెలిపారని ట్వీట్లో గుర్తుచేసుకున్నారు.
ప్రతి వర్గం నుంచి సంఘీభావం.!
రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు, విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు, సామాన్య మహిళల నుంచి కార్పొరేట్ సంస్థల ఉన్నతాధికారుల వరకు వివిధ వర్గాల ప్రజలు తనకు మద్దతుగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన సతీమణి, కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వచ్చారని గుర్తుచేసుకున్నారు. వారికి అండగా నిలిచిన ప్రజలు నిజాన్ని గెలిపించారని, ధర్మాన్ని నిలబెట్టారని వ్యాఖ్యానించారు.
మీ నమ్మకమే నా బలం.. మీ భవిష్యత్తే నా సంకల్పం.!
తనకు మద్దతు తెలిపిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానులకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం ప్రకటించిన వారందరికీ చంద్రబాబు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన ప్రేమ, అభిమానం, నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. తన కోసం నిలిచిన ప్రజల కోసం చివరి వరకు నిలబడతానని స్పష్టం చేశారు. 'మీ నమ్మకం, అభిమానం నా బలం.. మీ భవిష్యత్తు నా సంకల్పం' అని పేర్కొన్న చంద్రబాబు.. ప్రజల మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నంబర్ వన్‌గా నిలబెడతానని పునరుద్ఘాటించారు.
[ 53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics ]


