మార్చి నాటికి 51.91 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు.. సీఎం చంద్రబాబు హామీ.!
Published on: Sat Oct 10, 2026 2:55PM
.webp)
వైసీపీ పాలనలో ఆస్తి పత్రాలు, సర్వే రాళ్లపై ఓ నాయకుడి ఫొటోలు ముద్రించారని, తమ ప్రభుత్వంలో వాటిని తొలగించడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎలాంటి తప్పులు లేని రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 40.58 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 51.91 లక్షల పాస్‌పుస్తకాలు అందించడమే లక్ష్యమని వెల్లడించారు. ప్రతి నెలా 9వ తేదీన ఈ ప్రక్రియను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, పంపిణీలో ఎక్కడైనా తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామసభలో పాల్గొన్న చంద్రబాబు రైతులకు పాస్‌పుస్తకాలను అందజేశారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భూములకు భద్రత లేకుండా పోయిందని, రెవెన్యూ శాఖలో భూకబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోయాయని చంద్రబాబు విమర్శించారు. నాటి ప్రభుత్వం గిట్టనివారి భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 16 లక్షల ఎకరాలను ఆ జాబితా నుంచి తొలగించామని తెలిపారు. 244 ప్రధాన భూ సమస్యలను పరిష్కరించి 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని చెప్పారు. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, కైకలూరు ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించామని వెల్లడించారు. అమలాపురంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న 120 ఏళ్ల నాటి భూ సమస్యకు ముగింపు పలికామని, ప్రకాశం జిల్లాలోని నాలుగు మండలాల్లో గర్భకండ్రిక భూముల సమస్యను పరిష్కరించి 1,301 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చామని వివరించారు.

రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు రావాలంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే ఎలాంటి బేషజాలకు పోకుండా కేంద్ర నాయకులను కలుస్తున్నానని చెప్పారు. ఇటీవల దిల్లీ పర్యటనలో ప్రధానితో పాటు ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యామని తెలిపారు. రాష్ట్రానికి అదనంగా ఆరు లక్షల ఇళ్లు కేటాయించాలని కోరగా, ఈ ఏడాది మూడు లక్షలు, వచ్చే ఏడాది మరో మూడు లక్షల ఇళ్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో దిల్లీ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఇంటికి చేరుకున్నానని, శుక్రవారం ఉదయమే ప్రజల మధ్యకు వచ్చానని చెప్పారు. తాను బద్ధకిస్తే తన వెనుక ఉన్న అధికారులు, నాయకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉందని, అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్నానని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి ‘అమరజీవి జలధార’ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.30 వేల కోట్లతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామాల్లో రహదారులు, మురుగు కాలువల నిర్మాణం కోసం రూ.11,800 కోట్లతో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకంతో పాటు స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇప్పటివరకు 100 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
[ CM Chandrababu Naidu, AP CM, Pattadar Passbooks, 51.91 Lakh Passbooks, Mee Bhoomi Mee Hakku, Andhra Pradesh News, AP Government, Land Records, Farmers, 22A Prohibited List, Land Disputes, Welfare Schemes, Amarajeevi Jaladhara, Palle Panduga 3.0, Talli ki Vandanam, Stree Shakti Scheme, Free Bus Travel, AP Development, Telugu News ]


