TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భవిష్యత్ అవసరాలకు సమగ్ర నీటి ప్రణాళిక: సీఎం చంద్రబాబు

Published on: Wed Sep 30, 2026 9:36PM

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.!

రాష్ట్రంలోని వివిధ రంగాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో ఎక్కడా రాజీపడేది లేదని తెలిపారు.బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి అవసరమైన సమగ్ర నీటి ప్రణాళికను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి పంట కాల్వల వరకు పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎత్తిపోతల పథకాలు, మైక్రో ఇరిగేషన్, హైడల్ విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ఇందులో భాగంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు నీటిని నిరంతరాయంగా తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జలాశయాల నుంచి విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలకు క్రమం తప్పకుండా నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలవరం పనులు వేగవంతం.!

ఇరిగేషన్ క్యాలెండర్‌లో ప్రాధాన్యత ఇచ్చిన ప్రాజెక్టుల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. క్యాలెండర్‌లో నిర్దేశించిన గడువుల ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.పోలవరం ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ పురోగతిపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. పనులకు ఆర్థికపరమైన లేదా ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.పోలవరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటితో అనకాపల్లి జిల్లాలోని రిజర్వాయర్లను వీలైనంత మేర పూర్తి స్థాయిలో నింపాలని ఆదేశించారు.

జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన.!

జల సంరక్షణను ప్రజా ఉద్యమంగా మలచాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ప్రయోజనాలు, నీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.జలధార–జలహారతి వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు భూగర్భ జలాల పెంపుతో కలిగే ప్రయోజనాలను వివరించి ప్రతి ఒక్కరినీ జల సంరక్షణలో భాగస్వాములను చేయాలని సీఎం అధికారులకు సూచించారు.ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు ఆర్థిక, జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

 

[ CM Chandrababu Naidu, AP CM Chandrababu, Water Resources Review, Comprehensive Water Plan, Andhra Pradesh Irrigation, Irrigation Projects, Polavaram Project, Polavaram Left Main Canal, Water Security, Drinking Water, Irrigation Water, Industrial Water, Visakhapatnam Water Supply, Anakapalli Reservoirs, Irrigation Calendar ]