TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Tenali: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Published on: Sun Oct 4, 2026 2:43PM

తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో పీఎంఏవై–గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని చంద్రబాబు తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే మరో 3 లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 3 లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారని చెప్పారు. మొత్తంగా రాష్ట్రానికి 9 లక్షల ఇళ్లు అందించేందుకు హామీ లభించిందన్నారు.

3 లక్షల ఇళ్లు అంటే కేవలం నిర్మాణాలు కాదని.. 3 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు అన్నారు. సొంత ఇల్లు ఉంటే జీవన ప్రమాణాలు, ఆత్మగౌరవం పెరుగుతాయని చెప్పారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న ఆలోచనకు పునాది వేసింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 2029 నాటికి ఇళ్లులేని ప్రతి పేద కుటుంబానికి 100 శాతం ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.బుర్రిపాలెం పేరు చెప్పగానే సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకొస్తారని, ఇప్పుడు ఇదే గ్రామం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ హీరోగా ఎదిగారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేశారు.

‘పేదల మనిషి’గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను చంద్రబాబు అభివర్ణించారు. మధ్యప్రదేశ్‌లో నర్మదా–క్షిప్రా, కెన్–బెత్వా, నర్మదా–పార్వతీ నదుల అనుసంధానానికి ఆయన కృషి చేశారని తెలిపారు. ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయడంతో మధ్యప్రదేశ్ ప్రజలంతా ఆయనను ఆప్యాయంగా ‘మామ’ అని పిలుచుకుంటారని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 12 ఏళ్లలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగిందని చంద్రబాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ‘పల్లె పండుగ’ కింద రూ.11,500 కోట్లతో పనులు చేపట్టామని, వచ్చే ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ కార్యక్రమం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. 2019–24 మధ్య 6 లక్షల పేదల ఇళ్లను రద్దు చేశారని, ఇళ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. నివాసయోగ్యం కాని చెరువులు, గుట్టలు, ఇతర ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. దాదాపు 4 లక్షల మంది ఆ స్థలాలు వద్దంటూ వెనక్కి ఇచ్చేశారని పేర్కొన్నారు.ఇక బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లలో బయట వాతావరణంతో పోలిస్తే కనీసం 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు.

‘పేదల పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పేదలకు నివాస స్థలాలు అందించామని చంద్రబాబు తెలిపారు. విశాఖ, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు అందించామని చెప్పారు. వచ్చే మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు.గత ప్రభుత్వ హయాంలోని నేతల ఫొటోలను తొలగించి, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఒక్క పెన్షన్ పథకం ద్వారానే ఇప్పటివరకు రూ.76 వేల కోట్లు పేదలకు అందించామని తెలిపారు.

 

 

 

[ CM Chandrababu, Tenali, Burripalem, PMAY Gramin 2.0, PMAY Rural Housing, 3 Lakh Houses, Andhra Pradesh Housing, AP Government, Shivraj Singh Chouhan, PM Modi, Poor Families, Housing Scheme, Rural Development, 3D Concrete Technology, AP Development, Super Six, Pattadar Passbooks, Land Disputes, Palle Panduga, TDP, Andhra Pradesh Politics ]