TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాలనలో కొత్త ఒరవడి.. నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి : సీఎం చంద్రబాబు

Published on: Tue Sep 29, 2026 4:22PM

దేశాభివృద్ధిలో రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మారుతున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు, పాలనా విధానాలు, ఉద్యోగుల నైపుణ్యాల్లో నిరంతరం మార్పులు రావాలని సూచించారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవడంతో పాటు పాత విధానాలు, అనవసర నిబంధనలను సరళీకరించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పారు.

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సాధన శృంఖల-2026’ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

శిక్షణతో సేవల్లో మార్పు రావాలి.!

ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా.. ఉద్యోగుల నైపుణ్యాలను పెంచి సవాళ్లను పరిష్కరించే సంస్థలుగా మారాలని చంద్రబాబు సూచించారు. శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ పొందడం మాత్రమే కెపాసిటీ బిల్డింగ్ కాదని.. నేర్చుకున్న అంశాలను ఉద్యోగులు విధుల్లో ఎంతవరకు అమలు చేస్తున్నారు, ప్రజలకు అందే సేవల నాణ్యత ఎంత మెరుగుపడుతోంది అన్నదే అసలు కొలమానం అని స్పష్టం చేశారు.

కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి తొలి స్థానం.

ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ అవార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్‌డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ అలపర్తి అందుకున్నారు. రెండో స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో ఒడిశా నిలిచాయి.

మిషన్ కర్మయోగి కింద ఏపీలో సుమారు 7.89 లక్షల మంది ఉద్యోగులు ఐగాట్‌లో నమోదు అయ్యారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా కోర్సులు పూర్తి చేసి దేశంలోని రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందన్నారు. అయితే రెండు కోట్ల సర్టిఫికెట్ల కంటే.. శిక్షణ ద్వారా ఉద్యోగుల పనితీరు, ప్రజలకు అందే సేవల్లో వచ్చిన మార్పే ముఖ్యమని చెప్పారు.

టెక్నాలజీ మారితే.. పాలన కూడా మారాలి.!

కంప్యూటర్లు వచ్చినా పేపర్‌వర్క్ కొనసాగడం, దరఖాస్తులను డిజిటలైజ్ చేసినా అనవసర అనుమతులు కోరడం, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నా పౌరులను కార్యాలయాలకు రప్పించడం వంటి పాత విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. పాత విధానాలను డిజిటలైజ్ చేయడం మాత్రమే ఆధునిక పాలన కాదని.. మొత్తం ప్రక్రియనే సరళీకరించాలని సూచించారు.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ యుగం ప్రారంభమైందని, ఏఐను నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను ముందుగానే గుర్తించడం, ఉద్యోగుల నైపుణ్యాలను అంచనా వేయడం, శిక్షణ అవసరాలను గుర్తించడంలో వినియోగించుకోవాలని చెప్పారు. ఏపీలో రియల్‌టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత వ్యవస్థలు, ఈ-ఫైలింగ్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా పాలనను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఏపీ ఏఐ స్టాక్, మన మిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ వంటి కార్యక్రమాలను కూడా వినియోగిస్తున్నామని వివరించారు.

 

ప్రజా పాలనలో మానవీయతకు అత్యంత ప్రాధాన్యం ఉందని సీఎం అన్నారు. ఉద్యోగుల ముందున్న ప్రతి ఫైలు వెనుక ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ఉంటుందని గుర్తుచేశారు. వరదలు, తుపాన్లు, పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో కుటుంబాలను పక్కనపెట్టి ప్రజా సేవలో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించాలని చెప్పారు. ఉద్యోగులు నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని, ఐగాట్-మిషన్ కర్మయోగి ద్వారా అందుబాటులో ఉన్న శిక్షణలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రభుత్వ శాఖల మధ్య సమాచార మార్పిడి, వ్యవస్థల అనుసంధానం మరింత పెరగాలని చంద్రబాబు అన్నారు. సమస్యలు సంక్షోభంగా మారకముందే గుర్తించి పరిష్కరించేందుకు సమన్వయం అవసరమన్నారు. సాంకేతికత, విధానాలు, ప్రక్రియలు, ఉద్యోగుల సామర్థ్యాలను సమన్వయం చేసినప్పుడే వేగవంతమైన నిర్ణయాలు సాధ్యమవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని 61 శిక్షణ సంస్థలను ఉన్నతి కింద ఐగాట్‌తో అనుసంధానించామని, అమరావతిలో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీని ప్రవేశపెట్టి.. రాష్ట్రంలోని 38 శాఖలకు ప్రత్యేక కెపాసిటీ బిల్డింగ్ ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి ఎదిగే అవకాశం, ప్రతి సంస్థకు మెరుగుపడే అవకాశం, ప్రతి పౌరుడికి దాని ప్రయోజనం అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభుత్వం కేవలం నియంత్రించే వ్యవస్థగా కాకుండా.. ప్రజలను సాధికారత వైపు నడిపించే వ్యవస్థగా మారాలని చంద్రబాబు అన్నారు. 2047 వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు కోర్సులు పూర్తి చేయడమే కాకుండా.. నేర్చుకున్నదాన్ని విధుల్లో అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

 

 

 

 

 

[ CM Chandrababu, Andhra Pradesh, AP Government, Mission Karmayogi, Capacity Building, Governance Reforms, Digital Governance, AI Governance, Government Employees, Skill Development, iGOT, Real Time Governance, Public Services, Administrative Reforms, Andhra Pradesh Development, Swarna Andhra, Developed India 2047 ]