అక్టోబర్ 10 నిరసనలకు ముందు: బొద్దింకలకు నోటీసులు.!
Published on: Tue Oct 6, 2026 4:23PM

దేశ రాజకీయాల్లో ఎన్నికల సంఘం వ్యవహారంపై జరుగుతున్న చర్చల మధ్య, అక్టోబర్ 10న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కొత్త వివాదానికి తెరలేపింది. కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తమ కార్యకర్తలకు వివిధ రాష్ట్రాల్లో పోలీసులు నోటీసులు ఇస్తున్నారనీ, తద్వారా ఢిల్లీ నిరసనలో పాల్గొనకుండా ఒత్తిడి తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దీప్కే ఆరోపణల ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లోని కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేసి, ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? నిరసన హింసాత్మకంగా మారే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు చెప్పారు. ఈ విధానం ప్రజాస్వామ్య హక్కులపై ఒత్తిడిగా ఆయన అభివర్ణించారు. అభిజీత్ దీప్కే ఆరోపణలపై సంబంధిత పోలీసు విభాగాలు ఇంత వరకూ స్పందించలేదు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి విదితమే. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, పలు సామాజిక సంస్థలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు ఇస్తున్నాయి. ఎన్నికల జాబితాల సవరణ వల్ల కొంతమంది ఓటర్లు జాబితాల నుంచి తొలగించబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించడానికే ఈ ప్రక్రియ చేపట్టామని చెబుతోంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న ఢిల్లీలో భారీ స్థాయిలో యువత, విద్యార్థులతో నిరసన కు బొద్దింకల పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం కోసం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని సీజేపీ చెబుతోంది. ఇలా ఉండగా హస్తినలో భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఆందోళనను అణచివేసే దిశగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
[CJP October 10 Delhi Protest, Jantar Mantar, Police Notices, Election Commission, CEC Controversy, Telugu One]


