జాతీయ జెండా పట్టుకుంటే జైల్లో పెడతారా.. రాహుల్ గాంధీ ఆగ్రహం.!
Published on: Wed Oct 14, 2026 3:46PM

సీజేపీ నేతలకు ఐదు రోజుల కస్టడీ..తీహార్ జైలుకు తరలింపు.!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపినందుకు అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ జాతీయ జెండాను ప్రదర్శించడం నేరం కాదని, ఇందుకోసం యువతను జైల్లో పెట్టడం పిరికిపంద చర్య అని విమర్శించారు. పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు అందరూ ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ సభ్యులు జంతర్ మంతర్ వద్ద నిరసనకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి నిరసన ప్రదేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అరెస్టయిన మరో నేత అజింక్యా షిండే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.
అరెస్టయిన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కోర్టులో హాజరుపరచగా.. వారికి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. గతంలోనూ వీరు ఇలాంటి నిరసనలకు సంబంధించి అరెస్టయ్యారని, విడుదల సమయంలో చేసుకున్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో వీరిద్దరినీ తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, అజింక్యా షిండే రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.

ఈ అరెస్టులపై రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “జంతర్ మంతర్ భారత ప్రజలది. దానిని మేం తిరిగి స్వాధీనం చేసుకుంటాం. విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, ఇండియా కూటమి.. అందరి లక్ష్యం ఒక్కటే. పౌరుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం” అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీతో పాటు అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య థాకరే వంటి పలువురు విపక్ష నేతలు కూడా అరెస్టులను ఖండించారు.
తమకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, జాతీయ జెండాను ప్రదర్శించినందుకు ఐదు రోజుల పాటు జైలులో ఉంచడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. “దేశంలో ఎమర్జెన్సీ విధించాలనుకుంటే అధికారికంగా ప్రకటించండి. జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఊపినందుకే జైలుకు పంపే అనధికారిక ఎమర్జెన్సీ ఎందుకు?” అంటూ విమర్శించారు.
కాగా, ఢిల్లీ పోలీసులు ఈ నెల 11న జంతర్ మంతర్ను నిరసనల వేదికల జాబితా నుంచి తొలగించారు. నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేని ప్రాంతంలోకి ప్రవేశించడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై సీజేపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ అరెస్టులు, కోర్టు ఆదేశాలు, విపక్ష నేతల విమర్శలతో ఢిల్లీలో రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
[ CJP Leaders, Cockroach Janata Party, Rahul Gandhi, Saurav Das, Ashutosh Rankala, Ajinkya Shinde, Abhijeet Dipke, Gyanesh Kumar, Jantar Mantar Protest, Delhi Protest, Opposition Leaders, Peace Bond Violation, India Alliance, CJP News, Delhi Latest News, Jantar Mantar Controversy ]


