బొద్దింకల ఉద్యమం: ఆంక్షల వలయంలో హస్తిన.. ముందస్తు అరెస్టులు.!
Published on: Fri Oct 16, 2026 9:30AM

ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చిన లెహ్రా దో తిరంగా మార్చ్ దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ నిలిపివేత కోరుతూ బొద్దింకల పార్టీ చేపట్టిన ఈ ఆందోళన రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీలోని సెంట్రల్ పార్క్లో జరగాల్సిన ఈ భారీ త్రివర్ణ పతాక మార్చ్ కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు.
.webp)
శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ కౌన్సిల్ అధికారులు శుక్ర, శనివారాల్లో (అక్టోబర్ 16, 17) కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లోకి సాధారణ ప్రజల ప్రవేశాన్ని నిషేధించారు. మరోవైపు, సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండే తదితరులను పోలీసులు ముందుస్తుగానే అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. జాతీయ జెండాను చేతబూని జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం నేరం ఎలా అవుతుందని అభిజీత్ దీప్కే ప్రభుత్వాన్నినిలదీస్తున్నారు.
ఈ నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ విద్యార్థి సంఘం అయిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళన చేపట్టగా, పోలీసులు వారిని శుక్రవారం (అక్టోబర్ 16) ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దేశంలో జాతీయ జెండాను ప్రదర్శించడం కూడా నేరంగా మారుతోందని, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అయిన జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
[CJP Delhi tricolour march, Abhijeet Dipke, CJP protest, NSUI Workers Detained, Jantar Mantar, Election Commissioner, Resign Demand, Telugu One]


