TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్: అసలేం జరిగింది.?

Published on: Sat Oct 17, 2026 9:52AM

బొద్దింకల పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అరెస్టు చేశారు. కన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్కులో  లెహ్రోదో తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు అభిజీత్ దీప్కే శుక్రవారం (అక్టోబర్ 6) ప్రయత్నించారు. అయితే ఆ ర్యాలీకి అనుమతులు లేవంటూ పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు.  ఈ నేపథ్యంలో శనివారం (అక్టోబర్ 17)   ఎస్ఈఎం కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే.. ప్రస్తుతంఅభిజీత్ దీప్కే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత లేకపోవడంపై   సీజేపీ లీగల్ సెల్ చీఫ్ రత్నా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

ఢిల్లీలో తిరంగా యాత్ర నిర్వహించేందుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ, ఎలాంటి అధికారిక పర్మిషన్లు తీసుకోకుండానే ఈ నిరసనకు దిగడమే ఈ అరెస్టుకు  కారణంగా పోలీసులు చెబుతున్నారు. కన్నాట్ ప్లేస్ ప్రాంతం నిరసనలకు అధికారికంగా గుర్తింపు పొందిన ప్రదేశం కాదని, అంతేకాకుండా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ నుంచి కూడా ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు   హెచ్చరించారు. ఆంక్షలు అమల్లో ఉన్న ఈ ప్రాంతంలో పెద్దఎత్తున జనాన్ని సమీకరించి ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ర్యాలీకి ప్రయత్నించిన అభిజీత్ దీప్కేను అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

అయితే అభిజీత్ దీప్కే తనను పోలీసులు అదుపులోనికి తీసుకునే సమయంలో వారితో వాగ్వాదానికి దిగారు.  తాను ఏ చట్టాన్ని ఉల్లంఘించానని  నిలదీశారు. జాతీయ జెండాను ప్రదర్శించడం ఎలాంటి నేరం కాదని వాదించారు.  అదే సమయంలో 'ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్' (AISA) నేత నేహా బోరాను కూడా మండీ హౌస్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కొద్ది సేపటి తర్వాత విడుదల చేశారు.

ఈ పరిణామాలన్నీ కాక్రోచ్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం, అక్టోబర్ 13న జంతర్ మంతర్‌లోకి ప్రవేశించి జాతీయ జెండాను ఎగురవేశారనే ఆరోపణలతో సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన సమయంలోనూ అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా కేవలం ఒక్క వారంలోనే అభిజీత్ దీప్కే పోలీసుల అదుపులోకి రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ వరుస అరెస్టులతో ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది.

[CJP Chief Abhijit Dipke Arrest, Cockroach Janata Party,   Delhi Police, Lehra Do Tiranga, Connaught Place, Telugu One, Neha Bora]