న్యాయం రోడ్డెక్కింది..

ఏ సమస్య వచ్చినా న్యాయం కోసం తలుపు తట్టేది న్యాయస్థానాలనే..న్యాయ చెప్పమనేది న్యాయమూర్తులనే..మరి అలాంటి న్యాయమూర్తులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కితే. స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా తమ సమస్య పరిష్కారం కోరుతూ న్యాయమూర్తులు రోడ్డెక్కారు. గత నెల 3వ తేదిన ఉమ్మడి హైకోర్టు పూర్తి చేసింది. రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న న్యాయాధికారులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా జాబితాను రూపొందించింది. ఎటువంటి ఆప్షన్లు ఇవ్వని అధికారులకు సంబంధించి వారు విధుల్లో చేరినపుడు ఇచ్చిన ప్రాంతం ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది.

 

ఆ జాబితా వెలువడిన వెంటనే తెలంగాణ న్యాయాధికారులు దీనిని ఆక్షేపించారు. తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం చేస్తూ రూపొందించిన ఆ జాబితాను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారుల సర్వీసు రికార్డులో పేర్కొన్న ప్రాంతం ఆధారంగా కేటాయింపులు చేయాలని.. హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రాథమిక జాబితా రూపొందిందని విమర్శించారు. గత నెలలోనే దీనిని ఉపసంహరించుకోవాలని హైకోర్టుకు నోటీసులు అందజేశారు. ఎన్నిసార్లు కోరినా హైకోర్టు తమ ఆవేదనను అర్థం చేసుకోకపోవడంతో తెలంగాణ న్యాయాధికారులు రాజీనామాస్త్రాలను సంధించారు. నిన్న 120 మంది న్యాయాధికారులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేసి గన్‌పార్క్ నుంచి ర్యాలీగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముందస్తు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు న్యాయాధికారులను అడ్డుకున్నారు.

 

చివరికి న్యాయాధికారుల ప్రతినిధులను గవర్నర్ వద్దకు పంపడంతో వారు శాంతించారు. తమ సమస్యలు..హైకోర్టు వైఖరి తదితర వివరాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రతినిధులు గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. న్యాయాధికారుల విభజనకు హైకోర్టు శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయంగా భావించి ఇన్నాళ్లకు దయ చూపినందుకు ఆనందపడ్డాం కానీ ప్రాధమిక జాబితా చూసిన తర్వాత హైకోర్టు మాపై సవతి తల్లి ప్రేమ చూపినట్టు అర్థమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కేడర్లలో పోస్టులను ఖాళీగా ఉంచి, తెలంగాణలో మాత్రం ఖాళీలు లేకుండా చేశారు. ఏపీకి చెందిన యువ న్యాయాధికారులను ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణకు కేటాయించారు. తద్వారా ఎప్పటి నుంచో పదోన్నతి కోసం వేచి చూస్తున్న తెలంగాణ న్యాయాధికారుల అవకాశాలను ఘోరంగా దెబ్బతీశారు.

 

.రాజకీయంగా, పాలనాపరంగా తెలంగాణను సాధించుకున్నా..ఇప్పటికీ మేం ఏపీ హైకోర్టు కింద పనిచేస్తున్నామనే భావన కలుగుతుందే తప్ప..ఉమ్మడి హైకోర్టు కింద పనిచేస్తున్నామనిపించడం లేదనిపిస్తోంది. ఆంధ్రా పాలకుల కింద ఏ మాత్రం పనిచేయలేం. న్యాయాధికారులం కావడంతో మా మనస్సాక్షికి విరుద్థంగా మౌనంగా ఉంటూ వస్తున్నాం. ఇక మౌనంగా ఉండటం మా వల్ల కాదు. మా రాజీనామాలు పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు కనువిప్పు కలిగించకుంటే..హైకోర్టు ప్రాంగణంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలు వదిలేందుకు కూడా సిద్ధం. అంటూ వారి అధ్యక్షుడికి లేఖ రాశారు.