రెండు రోజుల సీఐఐ సదస్సు: కుదిరిన ఎంవోయూల విలువెంతంటే.?
Published on: Sat Nov 14, 2026 9:54AM
.webp)
విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 303 ప్రాజెక్టులకు సంబంధించి రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించిన ఎంవోయూలు కుదిరాయి. ఈ సదస్సు లక్ష్యం, పెట్టుబడులను ఆకర్షించడమే మాత్రమే కాదనీ, నిర్దేశిత గడువులోగా వాటిని క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. సీఐఐ సదస్సు ముగింపు సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ఈ రెండు రోజుల భాగస్వామ్య సదస్సులో, 65 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారన్నారు.
ఈ సదస్సు వేదికగా రిలయన్స్ సంస్థ 2.43 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. అలాగే కియా సంస్థ ఏడాదికి అదనంగా రెండు లక్షల కార్ల ఉత్పత్తి కోసం 18,878 కోట్లతో పెనుగొండ కియా ప్లాంట్ విస్తరణకు ఒప్పందం చేసుకుందని చంద్రబాబు వివరించారు.
2024 నుంచి రాష్ట్రానికి వచ్చిన 714 పెట్టుబడి ప్రతిపాదనల్లో ఇప్పటికే 522 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, అవుతున్నాయని వివరించారు. స్వచ్ఛ షహర్ కేటగిరీలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచిన విశాఖలో ఈ సదస్సు జరగడం గర్వకారణమన్నారు.
.webp)
పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, నాలా చట్టాన్ని రద్దు చేసి కేవలం 13 లైసెన్సులతో ఐదు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రవేశపెట్టిన ఎస్క్రో ఖాతా విధానం దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. అంతేకాకుండా, పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తెస్తామని ప్రకటించారు. గతంలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లుగానే, ఇప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఏఐ' విధానం ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్ వే భోగాపురం ఎయిర్‌పోర్ట్ : లోకేష్
పునరుత్పాదక ఇంధన రంగంలో దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఉండగా, ఏపీ ఒక్కటే 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేపట్టిన పీ4 ద్వారా ఇప్పటికే లక్ష మంది మార్గదర్శులు 11 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నారని చంద్రబాబు చెప్పారు. మరోవైపు, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు గోదావరి, కావేరి నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమన్న ఆయన మనమంతా ముందుగా భారతీయులమనే భావనతో రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా నీటి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
.webp)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, విభజన కష్టాలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అసాధారణ విజయమన్న ఆయన.. టెక్నాలజీ, ఏఐని పాలనలో వినియోగించడం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం ముఖ్యమంత్రి పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.
మీకు నచ్చవచ్చు: సాంకేతిక విప్లవం నుంచి అమరావతి క్వాంటమ్ హబ్ వరకు.. సీఎం చంద్రబాబు భవిష్యత్తు విజన్.!
ప్రభుత్వంతో మంచు మనోజ్ భార్య ఎంవోయూ: సీఐఐ వేదికగా సంతకాలు.!
[CIIPartnershipSummit, APInvestmentProposals, River Linking TeluguOne]


