TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాసిరకం బంతుల కొనుగోలు: వాటిపై కూకాబు్రా బ్రాండ్ ముద్రలు.. హెచ్ సీఏ అక్రమాల పర్వం.!

Published on: Fri Oct 23, 2026 10:22AM

తెలంగాణ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  వ్యవహారాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా కోట్లాది రూపాయల నిధులు దారిమళ్లిన వైనంపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ   అధికారులు తాజాగా కోర్టులో సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో  విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌సీఏలో ఏకంగా  92.08 కోట్ల మేర భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని సీఐడీ తన దర్యాప్తు నివేదికలో కుండబద్దలు కొట్టింది. క్రికెట్ అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పన కోసం బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను కొందరు అందినకాడికి దోచుకున్నారన్న  ఆరోపణలు   అక్షరసత్యాలని సీబీఐ చార్జిషీట్ పేర్కొంది. అసోసియేషన్ నిధులను ఇష్టానుసారంగా మళ్లించి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని పేర్కొంది.  దర్యాప్తు ముమ్మరం చేసిన క్రమంలో వెలుగు చూసిన ఈ కోట్ల రూపాయల కుంభకోణం క్రీడా వర్గాలను నివ్వెరపరుస్తోంది.

గత కొన్నేళ్లుగా హెచ్‌సీఏ నిర్వహణలో పారదర్శకత కొరవడిందని, నిధుల వినియోగంలో భారీగా గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీనిపై  దర్యాప్తు చేసిన సీఐడీ   అవినీతి బాగోతాన్ని  వెలికితీసింది.  . 92.08 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు చార్జిషీట్ లో పేర్కొంది.  స్టేడియం మెయింటెనెన్స్, మ్యాచ్‌ల నిర్వహణ, ఆటగాళ్ల సంక్షేమం పేరుతో జరిగిన ఖర్చుల వెనుక భారీ అక్రమాలు జరిగినట్లు సిబీఐ దర్యాప్తు నిగ్గు తేల్చింది.  సరైన బిల్లులు, రికార్డులు లేకుండానే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సీబీఐ చార్జిషీట్ పేర్కొంది. ఈ నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే దానిపై సీఐడీ దర్యాప్తు దూకుడు పెంచింది.  

కాగా మల్కాజిగిరి కోర్టులో సీఐడీ సమర్పించిన 80 పేజీల ఎఫ్ఐఆర్ లో  హెచ్‌సీఏ అధ్యక్షుడు ఎ. జగన్‌మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంతేల కూటమి అసోసియేషన్‌ను అడ్డాగా చేసుకుని  92.08 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టంచినట్లు సీఐడీ పేర్కొంది. క్రికెట్ పరికరాల కొనుగోళ్లు, మ్యాచ్ టికెట్ల విక్రయాలు, విమాన ప్రయాణ ఖర్చులు, చివరకు వర్ధమాన ఆటగాళ్ల ఎంపికల్లోనూ అడ్డగోలుగా లంచాలు వసూలు చేసినట్లు సీఐడీ పేర్కొంది.

 ప్రతిష్టాత్మక కూకాబుర్రా  బంతుల కొనుగోలు పేరిట నిందితులు భారీగా నకిలీ బిల్లులు సృష్టించడమే కాకుండా.. మార్కెట్‌లో చవకగా లభించే నాసిరకం బంతులను కొనుగోలు చేసి, వాటికి  కూకాబుర్రా బ్రాండ్ ముద్రలు వేసి నిధులను కాజేశారని సీఐడీ తన చార్జి షీట్ లో పేర్కొంది. అంతేకాకుండా  రికార్డులను సరిచేసేందుకు ఏకంగా 1,576 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం నుంచి కేవలం ఒక్కరోజులోనే బంతులు నగరానికి సరఫరా అయినట్లు తప్పుడు రవాణా బిల్లులు సృష్టించారని సీఐడీ సాక్ష్యాధారాలతో చార్జిషీట్ లో పేర్కొంది. 

[CID Chargesheet HCA Scam, Hyderabad Cricket Association, Financial Irregularities, HCA Corruption, Telugu One]