TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగారం కోసం బరితెగింపు.. జోగినిని కట్టేసి కిరాతకంగా హత్య. !

Published on: Sun Nov 1, 2026 9:35AM

60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి జరిగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. బంగారు ఆభరణాలు, నగదు కోసం ఓ జోగినిని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. ఏకంగా ఇంట్లోకి చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి ప్రాణాలు తీశారు. అనంతరం ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో బంగారం, నగదుతో పాటు కారును కూడా ఎత్తుకెళ్లారు.

చౌటుప్పల్‌లోని మార్కండేయ నగర్ కాలనీలో నివాసముంటున్న జోగిని రాళ్లబండి సుధాకర్ (48)ను గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. సుధాకర్ కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదును దోచుకున్నారు. అక్కడితో ఆగకుండా ఇంటి వద్ద ఉన్న కారును సైతం తీసుకుని పరారయ్యారు.

ఒకవైపు ప్రాణాలు తీసి.. మరోవైపు భారీ మొత్తంలో సొత్తును దోచుకెళ్లడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. హత్య జరిగిన తీరును పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సిద్దిపేట సమీపంలో నిందితుల పట్టివేత.!

ఇదిలా ఉంటే.. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. హత్య అనంతరం సుధాకర్ కారులో పరారవుతున్న నిందితులను సిద్దిపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన వారు అస్సాంకు చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం. బంగారం, నగదు కోసమే ఈ హత్యకు పాల్పడ్డారా? సుధాకర్‌ను ముందుగానే లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం హత్య చేశారా? ఈ దారుణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బంగారం, నగదు కోసం మనిషి ప్రాణాలనే బలితీసుకున్న ఈ ఘటన చౌటుప్పల్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితుల పట్టివేతకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు పోలీసుల అధికారిక ప్రకటనతో వెల్లడికావాల్సి ఉంది.

 

 

 

[ Choutuppal Murder Case, Jogini Murder, Yadadri Bhuvanagiri Crime, Gold Robbery, 60 Tolas Gold Theft, Telangana Crime News, Choutuppal Crime, Siddipet Police, Assam Suspects, Murder for Gold, Rs 10 Lakh Cash Theft, Telangana Police Investigation, Robbery and Murder, Breaking Crime News ]