TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూతురి కోసం వరుడిని ఎంపికచేసే ముందు ప్రతి తండ్రి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..!

Published on: Sun Oct 11, 2026 3:30PM

కూతురి కోసం వరుడిని ఎంపికచేసే ముందు ప్రతి తండ్రి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..!


 

కూతురి పెళ్లి అనేది ప్రతి తండ్రి జీవితంలో అత్యంత కీలకమైన, భావోద్వేగంతో కూడుకున్న ఘట్టం. తన గుండెల మీద పెంచిన బిడ్డ ఒక కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి, జీవితాంతం సంతోషంగా ఉండాలని ఏ తండ్రైనా కోరుకుంటాడు. అందుకే సరైన సంబంధం కుదర్చడం కోసం ఎంతో తాపత్రయపడతారు. అయితే కేవలం కుటుంబం, హోదా చూసి నిర్ణయం తీసేసుకుంటే సరిపోదు. అమ్మాయి భవిష్యత్తు ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలంటే వరుడిని ఎంపిక చేసే క్రమంలో కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. అవేంటో వివరంగా తెలుసుకుంటే..

స్వభావం..

సమాజంలో ఎంత మార్పు వచ్చినా, పెళ్లి విషయానికి వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. మొదటగా చూడాల్సింది అబ్బాయి స్వభావం, అలవాట్లు ఎలాంటివో తెలుసుకోవడం చాలా అవసరం. కోపం, పట్టుదల, అలవాట్ల విషయంలో అతడు ఎలా ఉంటాడో చుట్టుపక్కల వారి ద్వారా లేదా స్నేహితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పెళ్లి తర్వాత అమ్మాయిని గౌరవించే మనస్తత్వం అతనికి ఉందో లేదో గమనించడం చాలా ముఖ్యం.

స్థిరత్వం..

ఉద్యోగం లేదా వ్యాపారం స్థిరంగా ఉందో లేదో తెలుసుకోవాలి. జీతం ఎంత వస్తుంది అనే దానికంటే, అతనికి ఉండే ఆర్థిక బాధ్యతలు, పొదుపు చేసే అలవాటు ఎలాంటివో అర్థం చేసుకోవాలి. కేవలం అబ్బాయి మాత్రమే కాకుండా, ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తన, ఇంట్లో ఆడవారికి ఇచ్చే ప్రాధాన్యత కూడా చాలా ముఖ్యమైనవి. అబ్బాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటే, అమ్మాయి కూడా అక్కడ కొత్త జీవితాన్ని సులభంగా ప్రారంభించగలుగుతుంది.

ఆరోగ్యం..

వీటితో పాటు, అబ్బాయి ఆరోగ్య విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజుల్లో రెండు వైపులా ఆరోగ్య పరమైన వివరాలు స్పష్టంగా పంచుకోవడం చాలా మంచిది. అలాగే అబ్బాయి, అమ్మాయి ఆలోచనలు ఏమేరకు కలుస్తున్నాయి, వారి జీవనశైలి సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి ఇద్దరూ మాట్లాడుకునేలా అవకాశం ఇవ్వాలి.

తండ్రిగా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా, అన్ని కోణాల్లో ఆలోచించి ముందడుగు వేయడం వల్ల కూతురికి సరైన జీవిత భాగస్వామి దక్కుతాడు. ఆమె భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
 
                                                                                                                                              *రూపశ్రీ.