రిజర్వేషన్లు ఎవరూ ఇచ్చే భిక్ష కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు : కేంద్రమంత్రి పాశ్వాన్
Published on: Sun Aug 23, 2026 1:15PM

డిమాండ్ చేశారని రిజర్వేషన్ల రద్దు చేయలేం..!
దేశంలో సామాజిక న్యాయం, కోటా విధానంపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ మొదలైన వేళ కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు అనేవి ఏ ఒక్కరి డిమాండ్తోనో ముగిసిపోయే అంశం కాదని, అవి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన తేల్చిచెప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోటా విధానాన్ని నిరసిస్తూ విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు చేపట్టిన ఆందోళనలపై చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. పాట్నా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, రిజర్వేషన్లు ఎవరూ ఇచ్చే దానం లేదా భిక్ష కాదని, వివక్షకు గురైన వర్గాలను ఆదుకోవడానికి రాజ్యాంగ శిల్పులు అందించిన రక్షణ కవచమని పేర్కొన్నారు.
తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి రాజ్యాంగం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎవరూ ప్రశ్నించలేరని పునరుద్ఘాటించారు. అదే సమయంలో, నిరసనకారులు తమ డిమాండ్లను నిర్దిష్టమైన రీతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, చర్చల ద్వారానే ఈ అంశంపై ఉన్న అపోహలను తొలగించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇక ఆర్థిక ప్రతిపాదికన రిజర్వేషన్లు కావాలని కోరుతున్న వారికి ఇప్పటికే మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ (EWS) ద్వారా 10 శాతం కోటాను అమలు చేస్తోందని ఆయన గుర్తుచేశారు. దీనివల్ల ఎగువ కులాల్లోని పేదలకు కూడా న్యాయం జరుగుతోందని తెలిపారు. సమాజంలో ఇప్పటికీ అక్కడక్కడా సామాజిక వివక్ష సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయని, అందువల్ల సమానత్వం సిద్ధింజేవరకు కోటా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని చిరాగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ రాజధానిలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో ఆందోళనకారులతో ప్రభుత్వం చర్చలు జరిపి వివాదానికి ముగింపు పలుకుతుందో లేదో వేచి చూడాలి.
Chirag Paswan, Reservation Policy, Anti Quota Protest, Jantar Mantar Protest, Telugu News, Caste Reservation, EWS


