బొగ్గు విద్యుత్ శకం ముగిసినట్లేనా? చైనా సృష్టించిన ఈ విప్లవం గురించి తెలుసా!
Published on: Wed Sep 2, 2026 2:25PM

ప్రపంచ ఇంధన రంగంలో ఒక ఊహించని చారిత్రాత్మక మలుపు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా బొగ్గు విద్యుత్ పైనే ఆధారపడ్డ ప్రపంచ ఉత్పత్తి రంగానికి చైనా బిగ్ షాక్ ఇచ్చింది. తన శతాబ్దాల బొగ్గు ఆధిపత్యానికి తెర దించుతూ, చరిత్రలోనే తొలిసారిగా బొగ్గు కంటే అత్యధిక సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని సాధించి రికార్డు సృష్టించింది. చైనా నేషనల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ (NEA) వెల్లడించిన గణాంకాల ప్రకారం, జూలై 2026 చివరి నాటికి చైనా యొక్క సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇన్స్టాల్డ్ సామర్థ్యం 1,286 గిగావాట్లకు (GW) చేరుకుంది. ఇది ఆ దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ఏకంగా 31.5 శాతానికి సమానం కావడం విశేషం. మరోవైపు, 2026 మొదటి అర్ధభాగంలో చైనా మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వాటా తొలిసారిగా 50 శాతం కంటే దిగువకు పడిపోవడం గ్రీన్ ఎనర్జీ దిశగా సాధించిన అతిపెద్ద విజయం.
సోలార్ రంగాన్ని చైనా ఎంత వేగంగా విస్తరిస్తోందో డేటా పక్కాగా చూపిస్తోంది. జూలై చివరి నాటికి చైనా మొత్తం విద్యుత్ వినియోగంలో సోలార్ వాటా దాదాపు 13 శాతానికి చేరుకుంది. 2026 లోని మొదటి ఏడు నెలల్లోనే చైనా ఏకంగా 802.4 బిలియన్ కిలోవాట్-అవర్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 15.5 శాతం వృద్ధి కావడం విశేషం. ప్రపంచ సోలార్ మాడ్యూల్ తయారీలో ప్రస్తుతం 80 శాతం వాటా చైనా వద్దే ఉండడం వల్ల, వారు గ్లోబల్ సోలార్ విపణిని శాసిస్తున్నారు. అంతేకాకుండా, గ్రిడ్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు 2026-30 కాలంలో ఏకంగా 5 ట్రిలియన్ యువాన్లు (సుమారు 743.8 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్న తరుణంలో ఈ సోలార్ విప్లవం చైనాకు కొండంత అండగా నిలుస్తోంది.
మరి చైనా ఇంతటి రికార్డు సృష్టిస్తున్న వేళ మన భారతదేశం ఎక్కడ ఉంది అనే ప్రశ్న ప్రతిఒక్కరిలోనూ మెదులుతోంది. భారత్ కూడా సోలార్ విస్తరణలో రికార్డు స్థాయి వేగంతో దూసుకుపోతోంది. జూలై 31, 2026 నాటికి భారత కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, మన దేశ సోలార్ ఇన్స్టాల్డ్ సామర్థ్యం 164.59 గిగావాట్లకు చేరుకుంది. 2014లో భారత్ వద్ద ఉన్న సోలార్ సామర్థ్యం కేవలం 2.8 గిగావాట్లు మాత్రమే అని పరిశీలిస్తే, ఇది అద్భుతమైన ప్రగతి అని చెప్పవచ్చు. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఒక్క ఏడాదిలోనే 44.61 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని అదనంగా జోడించి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం విధించుకున్న 34 గిగావాట్ల లక్ష్యాన్ని దాటడమే కాకుండా, క్రితం ఏడాది సాధించిన 23.83 గిగావాట్ల కంటే దాదాపు రెట్టింపు వృద్ధిని సాధించింది.
china vs india solar energy capacity growth,india solar power installed capacity 2026.


