చైనా నేపాల్ సరిహద్దులో ప్రళయం: లెవెల్ 4 అలర్ట్ జారీ వెనుక అసలు నిజం!
Published on: Fri Aug 28, 2026 10:50AM

టిబెట్ మరియు నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఘోరమైన ఆకస్మిక వరదలు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో చైనా అత్యవసరంగా 'లెవెల్-IV' ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదల దాటికి రెండు నదుల సంగమం వద్ద ఒక భారీ కృత్రిమ సరస్సు ఏర్పడి, అది ఏ క్షణంలోనైనా గండిపడి దిగువ ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. చైనాలోని అత్యవసర స్పందన వ్యవస్థలో లెవెల్-I అత్యంత తీవ్రమైనది కాగా, లెవెల్-IV అత్యంత ప్రాథమిక ప్రమాద హెచ్చరికగా పరిగణిస్తారు. టిబెట్ ప్రాంతంలో పుట్టి నేపాల్ లోకి ప్రవహించే చోచెన్ ఖోలా మరియు పురేపు త్సాంగ్పో నదుల సంగమ ప్రదేశంలో ఈ ప్రళయకోరలు విరుచుకుపడ్డాయి. ఈ నదులు నేపాల్లోని భోటే కోశి నదీ వ్యవస్థలో ప్రధాన భాగాలుగా ఉన్నాయి.
గురువారం ఉదయానికి అందిన అధికారిక లెక్కల ప్రకారం, కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహం ఆగిపోవడం వల్ల ఏర్పడిన ఈ కృత్రిమ సరస్సులో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు పేరుకుపోయింది. రాబోయే మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, నీటి ప్రవాహం మరొక 30 లక్షల క్యూబిక్ మీటర్లకు పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ సరస్సుకు గండిపడితే, ఆ ప్రళయ జలాలు కొట్టుకువచ్చి చైనా-నేపాల్ సరిహద్దులోని కీలకమైన గైరోంగ్ పోర్ట్ తో పాటు దిగువన ఉన్న అనేక నివాస ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్థానిక యంత్రాంగం నిరంతరం నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ, ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఈ దారుణమైన ప్రకృతి విపత్తు వల్ల టిబెట్ వైపు ఉన్న గైరోంగ్ కౌంటీలో దాదాపు 558 మంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. వీరిలో అనేకమంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినప్పటికీ, ప్రమాదకరంగా మారుతున్న కృత్రిమ సరస్సు సహాయక చర్యలకు పెద్ద సవాలుగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం రంగంలోకి దిగి హైటెక్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సిఎన్‌ఎస్‌ఎ) ఉపగ్రహాలను రంగంలోకి దించి, విపత్తుకు ముందు మరియు తర్వాత తీసిన 15 రకాల ఉపగ్రహ చిత్రాలను సహాయక బృందాలకు అందించింది. అంతేకాకుండా 'వింగ్ లాంగ్' అనే అత్యాధునిక డ్రోన్లను, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి బురద, చెట్ల పొదల్లో చిక్కుకున్న మనుషుల శరీర వేడి సంకేతాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
tibet barrier lake floods alert,china issues level 4 disaster alert.


