చిన్నారిని బావిలో పడేసిన కోతి… కాపాడిన డైపర్
posted on: Jan 24, 2026 12:08PM

ఛత్తీస్‌గఢ్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. తల్లి చేతుల్లో ఉన్న 20 రోజుల పసికందును కోతి లాక్కెళ్లి బావిలో పడేసినప్పటికీ, చిన్నారికి వేసిన డైపర్ వల్ల ప్రాణాలు నిలిచాయి.
సియోని జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన పసికందుతో ఇంటి బయట కూర్చుని ఉంది. అలా ఉండగానే అక్కడికి వచ్చిన కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ సమయంలో ఓ కోతి మహిళ ఒడిలో ఉన్న చిన్నారిని లాక్కెళ్లింది. తల్లి కేకలు వేయడంతో పాటు గ్రామస్థులు వెంటనే కోతిని వెంబడించారు.
భయంతో కోతి కొంత దూరం వెళ్లి పసికందును ఓ బావిలో విసిరేసి పారిపోయింది. చిన్నారి కోసం వెతుకుతూ వెళ్లిన గ్రామస్థులకు బావిలో నీటిపై తేలుతూ చిన్నారి కనిపించింది. వెంటనే బావిలోకి దిగి శిశువును రక్షించారు.
పాపకు వేసిన డైపర్ నీటిలో లైఫ్ జాకెట్‌లా పనిచేయడంతోనే చిన్నారి ప్రాణాలు నిలిచాయని స్థానిక నర్సు రాజేశ్వరి తెలిపారు. బావిలో నుంచి తీసిన వెంటనే శిశువుకు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
కోతులు, ఇతర అడవి జంతువులు తరచూ ఇళ్లలోకి వచ్చి దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని వారు వాపోయారు.






