AI వల్ల మరో ప్రాణం గాల్లోకి.. వైద్యుల హెచ్చరికలను కాదని చాట్‌జీపీటీని నమ్మి మహిళ మృతి!
Published on: Thu Nov 5, 2026 10:16AM

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రోజురోజుకూ మానవ జీవితంలో ఒక భాగమైపోతున్న తరుణంలో, టెక్నాలజీ అతిగా నమ్మితే జరిగే ప్రాణాంతక ముప్పునకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని సియాటెల్‌లో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన 31 ఏళ్ల బోవెన్ వాన్ అనే యువతి మూర్ఛ (Epilepsy) వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ మరణానికి ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా కృత్రిమ మేధ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) ఇచ్చిన సలహాలను గుడ్డిగా నమ్మడమే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఓపెన్ఏఐ (OpenAI) సంస్థపై కోర్టులో కేసు వేశారు.
చైనాకు చెందిన బోవెన్ వాన్ ఉపాధి నిమిత్తం అమెరికాకు వెళ్లగా, తీవ్రమైన మూర్ఛ వ్యాధి లక్షణాల కారణంగా ఆమె గతంలోనే ఉద్యోగానికి కొంత విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో లామోట్రిజిన్ (Lamotrigine) అనే మందును వాడుతూ నియంత్రణ సాధించింది. అయితే, తాను వాడుతున్న ఈ మందుల వల్ల ఆలోచనా శక్తి నెమ్మదించడం, మాటలు తడబడటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆమె తీవ్ర ఆందోళన చెందింది. ఇదే సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో, అమెరికాలో ఉండాలంటే త్వరగా మరో ఉద్యోగం సంపాదించాలనే తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ భయాలతోనే ఆమె వైద్యులను సంప్రదించకుండా, నేరుగా చాట్‌జీపీటీని ఆశ్రయించింది.

తన అనారోగ్య సమస్యలు, మందుల మోతాదు గురించి బోవెన్ వాన్ చాట్‌జీపీటీని ఏకంగా 158 సార్లు సంప్రదించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రోజువారీ వాడే 400 మి.గ్రా. మందుల మోతాదును పూర్తిగా సున్నాకు తగ్గించుకునేందుకు చాట్‌జీపీటీ ఆమెకు కేవలం 25 రోజుల ప్రణాళికను రూపొందించి ఇచ్చినట్లు దావాలో పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన తగ్గింపు సమయంలో ఆమె తీవ్రమైన గందరగోళం, మైకం వంటి లక్షణాలను ఎదుర్కొన్నప్పటికీ, చాట్‌జీపీటీ మాత్రం మెదడు సహజ స్థితికి వస్తోందంటూ తప్పుడు భరోసా ఇచ్చింది. చివరి రోజుల్లో తన మెదడు పూర్తిగా అలసిపోయిందని, మళ్లీ మందులు వాడాలా అని ఆమె ఆందోళనతో ప్రశ్నించినా, చాట్‌బాట్ మాత్రం మోతాదును సున్నా వద్దే కొనసాగించమని సూచించింది.
చివరికి 2026 ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి ఆమె చివరి సందేశం పంపిన తర్వాత ఎటువంటి స్పందన లేకపోవడంతో, అనుమానం వచ్చిన తండ్రి స్నేహితుల సహాయంతో అపార్ట్‌మెంట్‌ను పరిశీలించగా బోవెన్ విగతజీవిగా పడిఉంది. వైద్య పరీక్షల్లో ఆమె మరణానికి మూర్ఛ వ్యాధితో సంబంధం ఉన్న ఆకస్మిక మరణం (SUDEP - Sudden Unexpected Death in Epilepsy) కారణమని తేలింది. మందులను ఏమాత్రం ఆపకూడదని వైద్యులు స్పష్టం చేస్తుండగా, ఏఐ చాట్‌బాట్ మాత్రం వైద్య సలహాలను ధిక్కరించేలా వ్యవహరించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై, వైద్యపరమైన నిర్ణయాల్లో ఏఐని గుడ్డిగా నమ్మడంపై తీవ్రమైన చర్చకు దారితీసింది.
ChatGPT Medical Advice Danger, AI Healthcare Risks, Woman Dies Trusting Chatbot, Artificial Intelligence Safety Warning, Doctor Vs AI Diagnosis, Tech News In Telugu, Health Awareness Articles.


