TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చాట్ జీపీటీ హ్యాక్ చేసిన క్లాడ్ ఏఐ.!

Published on: Mon Sep 21, 2026 11:32AM

ఏఐ రంగంలో   చోటుచేసుకుంటున్న పరిణామాలు టెక్ నిపుణులను విస్మయానికీ, ఆందోళనకూ గురిచేస్తున్నాయి. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐకి చెందిన  చాట్‌జీపీటీ వ్యవస్థలోకి చొరబడేందుకు ప్రత్యర్థి సంస్థకు చెందిన మరో ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించిన ఘటన ప్రస్తుతం త టెక్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది.  సాఫ్ట్‌వేర్ భద్రతా ప్రమాణాలను పరీక్షించే నిపుణులు ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన  క్లాడ్  ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ఓపెన్‌ఏఐ టూల్స్‌ను హ్యాక్ చేయడం డిజిటల్ భద్రత విషయంలో పెను సంచలనం, తీవ్ర ఆందోళన సృష్టించింది.  

ఈ ఉదంతం ఆధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సైబర్ దాడులకు సులువుగా గురౌతాయన్న అంశం మరో సారి చర్చకు వచ్చింది.  సాఫ్ట్‌వేర్ కోడింగ్‌ను నిరంతరం పరిశీలిస్తూ లోపాలను సరిదిద్దే హ్యాక్ట్రాన్ ఏఐ అనే స్వతంత్య్ర భద్రతా సంస్థకు చెందిన రీసెర్చ్‌సర్లు ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. ఓపెన్‌ఏఐ ఉద్యోగులు ఉపయోగించే అధికారిక చర్చా వేదికను, అలాగే చాట్‌జీపీటీ ఖాతాలను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి వీరు క్లాడ్ ఏఐ సహాయం తీసుకున్నారు. ఈ పద్ధతి ద్వారా ఓపెన్‌ఏఐ సంస్థకు చెందిన సోర్స్ కోడ్ ఎక్కడ భద్రపరిచారు..  దాని నిర్వహణ విధానం ఎలా ఉందనే కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ మొత్తం ప్రక్రియ   72 గంటల వ్యవధిలోనే..  (ప్రారంభ అన్వేషణ నుంచి ఓపెన్‌ఏఐ రిపాజిటరీ యాక్సెస్ సాధించే వరకు అన్ని దశలు) పూర్తయినట్లు వారు వివరించారు.

ఈ హ్యాకింగ్ ప్రయోగం వెనుక ముగ్గురు ఇండియన్ టెక్ సెక్యూరిటీ నిపుణులు ఉన్నారు.    తాము అమలు చేస్తున్న బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగానే ఈ భద్రతా పరీక్షను నిర్వహించినట్లు ఓపెన్‌ఏఐ సంస్థ స్పష్టం చేసింది. ఓపెన్‌ఏఐకి చెందిన పబ్లిక్ కమ్యూనిటీ ఫోరమ్‌లో   చిన్న లోపాన్ని వీరు గుర్తించారు. ఇమేజ్ ఫైల్స్ హ్యాండ్లింగ్ విషయంలో ఉన్న ఆ సాంకేతిక లోపమే సర్వర్‌పై కోడ్ రన్ చేసేందుకు వీలు కల్పించిందని తెలిపారు.

ఈ బలహీనతను గుర్తించిన అనంతరం, దాన్ని మరింత లోతుగా విశ్లేషించడానికి, ఎక్స్‌ప్లాయిట్‌ను వేగంగా సృష్టించడానికి ఆంథ్రోపిక్ క్లాడ్ చాట్‌బాట్‌ను ఉపయోగించుకున్నట్లు వెల్లడించారు. క్లాడ్ ఏఐ అందించిన కోడింగ్,  డీబగ్గింగ్ సహాయంతో ఉద్యోగుల లాగిన్ టోకెన్లను సేకరించి, అంతిమంగా ఓపెన్‌ఏఐ ప్రైవేట్ గిట్‌హబ్ వాతావరణంలోకి ప్రవేశించే మార్గాన్ని సులభంగా కనుగొనగలిగామని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే..  ఈ సమాచారాన్ని తాము ఎక్కడా దుర్వినియోగం చేయలేదని, కేవలం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపడానికే ఈ మోరల్ హ్యాకింగ్ చేపట్టామని   స్పష్టం చేశారు. 

ఈ భద్రతా లోపానికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే ఓపెన్‌ఏఐ, డిస్‌కోర్స్ అధికారులకు చేరవేసి, లోపాన్ని సరిదిద్దేందుకు  సహకరించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఓపెన్‌ఏఐ సంస్థ భద్రతా నిపుణుల బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. కమ్యూనిటీ సైన్-ఇన్ టోకెన్ల అనుమతుల పరిధిని మరింత కట్టుదిట్టం చేశామని, ప్రభావితమైన పాత టోకెన్లు,  సెషన్లను  రద్దు చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా, నైతిక హ్యాకింగ్‌లో భాగంగా లోపాలను ముందుగానే గుర్తించి సమాచారం అందించినందుకు గాను ఆ రీసెర్చ్ బృందానికి బగ్ బౌంటీ కింద 6,500 డాలర్ల రివార్డును కూడా అందించింది. 

ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భద్రతా ప్రమాణాలు,  దుర్వినియోగం గురించిన ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏఐ మోడల్స్ ఊహించని రీతిలో స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ, స్వతంత్రంగా  వ్యవహరిస్తున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతికతలు మానవాళికి పెను ముప్పుగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో,  ఒక ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి మరో ఏఐ సంస్థ వ్యవస్థలను ఛేదించడం సాంకేతిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. రాబోయే రోజుల్లో ఏఐ భద్రతా నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

[ChatGPT, Claude AI, OpenAI hack, Hacktron AI, Cybersecurity researchers, Telugu One]