పోలవరాన్ని గోదాట్లో ముంచారు.. మెగా డీఎస్సీకి అడ్డుపడ్డారు.. జగన్ పాలనపై చంద్రబాబు ఫైర్.!
Published on: Wed Sep 9, 2026 3:05PM

రాష్ట్రంలో జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జరిగిన విధ్వంసం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో వెనుకబడేలా చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విమర్శించారు. జగన్ హయాంలో కీలక ప్రాజెక్టులను నాశనం చేశారని దుయ్యబట్టారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో ‘మీ భూమి- మీ హక్కు’ సభలో పాల్గొన్న ఆయన వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ఎండగట్టారు.
వ్యవస్థలను భ్రష్టుపట్టించడంలో జగన్, ఆయన ప్రభుత్వం చూపిన చొరవ అభివృద్ధిపై చూపలేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు, ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం పరిస్థితి అధ్వానంగా తయారవడానికి జగన్ ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణమన్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన సమయంతో పోలిస్తే జగన్ హయాంలో పరిస్థితులు మరింత దిగజారాయన్నారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తమ కూటమి ప్రభుత్వం శ్రమిస్తుంటే, జగన్ నాయకత్వంలోని వైసీపీ మాత్రం నిత్యం తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్న చంద్రబాబు.. ఏ మంచి పని జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ రాజకీయాలు సాగుతున్నాయన్నారు. వి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడేలా గత పాలకులు వ్యవహరించారనీ, నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ప్రక్రియను కూడా వివిధ రకాలుగా అడ్డుకోవాలని కుట్రలు పన్నారని ఫైర్ అయ్యారు. అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కకుండా ఉద్దేశపూర్వకంగానే కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను సృష్టించారని, ఇది నిరుద్యోగ యువతకు వ్యతిరేకంగా చేసిన ద్రోహమని చంద్రబాబు విమర్శించారు.
ఇరిగేషన్ రంగానికి వెన్నుముకగా నిలవాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ అధికారంలో ఉండగా తీవ్రంగా దెబ్బతీశారన్న చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పకడ్బందీ ప్రణాళిక లేకపోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడమేకాక, నిర్మాణ పనులన్నీ అస్తవ్యస్తంగా మారామని వివరించారు. దీనివల్ల ప్రాజెక్టు అంచనాలు పెరగడంతో పాటు లక్ష్యం నీరుగారిపోయిందన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రాజెక్టుల పునరుద్ధరణతో పాటు సాగు, తాగునీటి అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పనులను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
[Chandrababu Naidu Criricise Jagan Rule, Polavaram Project, Mega DSC, YCP governance, AP Politics, Telugu One]


